తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే సిరీస్​పైనా కన్నేసిన రోహిత్​ సేన.. ఇంగ్లాండ్​తో తొలి మ్యాచ్​కు సిద్ధం - Ind v Eng

ఇంగ్లాండ్​ గడ్డ మీద మూడు టీ20ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్​కు సన్నద్ధమైంది. 'ది ఓవల్' మైదానం వేదికగా మంగళవారం తొలి వన్డే జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం. రోహిత్ సారథ్యంలో భారత్​.. బట్లర్​ కెప్టెన్సీలో ఇంగ్లాండ్​ అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్​కు విరాట్​ కోహ్లీ గాయం కారణంగా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PREVIEW: India look to carry T20 template into ODIs
ఇంగ్లాండ్- భారత్​ హోరాహోరీ.. తొలి వన్డేకు సన్నద్ధం

By

Published : Jul 11, 2022, 10:58 PM IST

ఇంగ్లాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్‌ కోసం సిద్ధమైంది. బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వన్డేల్లోనూ ఇంగ్లిష్‌ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా టీ20 సిరీస్‌లో భారత బ్యాటర్లు ఏ మాత్రం బెణుకు లేకుండా తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. అదే దూకుడైన ఆటతీరును వన్డేల్లోనూ ప్రదర్శించాలని రోహిత్‌ సేన కోరుకుంటోంది.

కేవలం వన్డే జట్టుకు మాత్రమే ఎంపికైన శిఖర్‌ ధావన్‌... కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత ఫామ్‌లో ఉండగా.. హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా టీ20ల్లో బ్యాటింగ్‌లో సత్తా చాటారు. పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను బుమ్రా, షమీతో కలిసి సిరాజ్‌ లేదా శార్దూల్‌ ఠాకూర్‌ పంచుకునే అవకాశం ఉంది. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

మరోవైపు బట్లర్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌ జట్టు వన్డేల్లో బరిలోకి దిగనుంది. చివరి టెస్టులో నెగ్గి టెస్టు సిరీస్‌ సమం చేసినా.. టీ20 సిరీస్‌లో ఓటమి ఇంగ్లాండ్‌ను అసంతృప్తికి గురి చేసింది. వన్డే సిరీస్‌ నెగ్గి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. వన్డేలకు బెన్‌స్టోక్స్‌, జో రూట్‌, బెయిర్‌స్టో రాకతో ఇంగ్లాండ్‌ జట్టు పటిష్ఠంగా మారింది. జో రూట్‌ టీ20ల్లో ఆడటం లేదు. చివరి టెస్టు తర్వాత బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్‌కు టీ20 సిరీస్​కు విశ్రాంతినిచ్చారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ మంగళవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభం కానుంది.

తొలి వన్డేకు కోహ్లీ దూరం..!

తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గజ్జల్లో గాయం కారణంగానే కోహ్లీ తొలి మ్యాచ్​ ఆడట్లేదని తెలుస్తోంది. సోమవారం ప్రాక్టీస్‌ చేయడానికి కోహ్లీ రాలేదట. నాటింగ్‌హమ్ నుంచి లండన్‌కు బస్సులో టీం అంతా రాగా కోహ్లీ ఒక్కడే రాకపోవడం.. అనుమానాలను రెట్టింపు చేసింది.

భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ప్రసీద్ కృష్ణ, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.

ఇంగ్లాండ్​ జట్టు:జోస్ బట్లర్ (కెప్టెన్ ), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, సామ్ కరాన్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రెయిగ్ ఓవర్టన్, మాథ్యూ పార్కిన్సన్, జో రూట్, జాసన్ రాయ్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ

ఇదీ చదవండి:టీ-20ల్లో శతక వీరులు.. టీమ్​ ఇండియా తరఫున వీరే..

ABOUT THE AUTHOR

...view details