Praggnanandhaa Mother : అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరిగిన ఫిడే చెస్ ప్రపంచకప్ సెమీస్‌లో కరువానా లాంటి మేటి చెస్ ప్లేయర్‌ను చిత్తు చేసిన చెస్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడ్డాడు. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో బుధవారం ఈ ఇద్దరు మరోసారి తలపడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సెమీస్‌లో ప్రజ్ఞానంద ఆట తీరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఆ కుర్రవాడి ఈ మేరకు ప్రదర్శన ఇచ్చి యావత్ ప్రపంచాన్నే తనవైపునకు చూసేలా చేశాడు. ఆ విజయోత్సాహంతో తన తల్లి ముఖం చిరునవ్వుతో నిండిపోగా.. ఆ ఆనంద క్షణాలు ఇప్పుడు యావత్ భారత్ సగర్వంగా చెప్పుకునేలా మారింది. అయితే ప్రజ్ఞానంద విజయంలో క్రెడిట్లో కొంత అతడి తల్లి నాగలక్ష్మికి దక్కుతుంది.
అమ్మ చేసిన ఆ ఒక్క పని..
ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా చెస్ మాస్టరే. ఆమె ప్రస్తుతం మహిళల ఇంటర్నేషనల్ మాస్టర్‌గా కొనసాగుతోంది. అయితే చిన్నప్పుడు వైశాలి టీవీతోనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని భావించిన తల్లి.. ఆమె దృష్టి మరల్చేందుకు ఓ చెస్ బోర్డు కొనిచ్చింది. ఇది చూసిన ప్రజ్ఞానందకు చెస్‌పై ఆసక్తి కలిగింది. దీంతో ఇంట్లోనే అక్కతో ఆడుతూ ఎన్నో నేర్చుకున్నాడు. అప్పుడు అతని వయసు నాలుగేళ్లు. ఇది గమనించిన తల్లిదండ్రులు.. ప్రజ్ఞానందాను త్యాగరాజన్ అనే కోచ్ దగ్గర శిక్షణకు చేర్పించారు. ఇక స్వీయ ప్రతిభకు శిక్షణ తోడవడం వల్ల పిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ ఆటలో రాణించాడు ప్రజ్ఞానంద .
అలా చెస్‌లో రాణిస్తూ.. బాల మేధావిగా పేరు తెచ్చుకున్న ప్రజ్ఞానంద.. 10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్‌గా ఎదిగి ప్రపంచ చెస్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. మరో రెండేళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా ఘనత సాధించాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్ ప్రతిభకు ఆనంద్ సహా ఎందరో దిగ్గజ ప్లేయర్లు ముగ్ధులయ్యారు.