Praggnanandhaa Chess : చెస్ ప్రపంచకప్‌లో రెండో స్థానంలో నిలిచిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. వచ్చే ఏడాది కెనడాలో ఏప్రిల్‌లో జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడు కూడా అతనే. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్ తర్వాత ఆ టైటిల్‌ను ముద్దాడే సత్తా మన ప్రజ్ఞానందలో ఉందని అందరూ భావిస్తున్నారు. ఇది అతని ఇప్పటికి వరకు విజయనికి నిదర్శనం. ప్రపంచకప్‌లో 2690 ఎలో రేటింగ్‌తో ఉన్న ప్రజ్ఞానంద.. నాలుగో రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా (అమెరికా- రేటింగ్ 2787)పై సంచలన విజయాన్ని సాధించాడు.
టైబ్రేక్‌లో అతనిపై ప్రజ్ఞానంద పైచేయి సాధించాడు. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌లో ఫెరెంచ్ (హంగేరీ- రేటింగ్ 2615)ను మట్టికరిపించిన ప్రజ్ఞానంద.. క్వార్టర్స్‌లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్ (2710)పై గెలుపొందాడు. సుదీర్ఘంగా సాగిన ఈ టైబ్రేక్ పోరులో పట్టువదలకుండా విజయం సాధించాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా- రేటింగ్ 2782)కు టైబ్రేక్‌లో చుక్కలు చూపించాడు. ఇక ఫైనల్లో కార్ల్‌సన్ (2835)తో పోరాడి ఓడాడు.
Praggnanandhaa FIDE World Cup 2023 : అయితే ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద ప్రదర్శన చూసిన విదేశీ అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్లు సైతం క్యాండిడేట్స్‌లో గెలిచే సత్తా అతనికి ఉందని కొనియాడుతున్నారు. 8 మంది అత్యుత్తమ ఆటగాళ్లు తలపడే ఈ టోర్నీలో గెలిచిన ప్లేయర్.. 2024 ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెన్‌తో పోటీపడతాడు. ఇక ప్రజ్ఞానంద ఇదే జోరు కొనసాగిస్తే క్యాండిడేట్స్ టోర్నీలో అతని గెలుపు ఖాయమేనని చెప్పొచ్చు. క్లాసిక్, ర్యాపిడ్, బ్లిట్జ్.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ రాణించగల నైపుణ్యాలు ప్రజ్ఞానంద సొంతం. అంతే కాకుండా గేమ్‌లో వెనుకబడ్డ, ఎత్తుల్లో తడబడ్డా కూడా తిరిగి మెరుగ్గా డిఫెండ్ చేసుకునే సామర్థ్యంతో అతను చెస్ ప్రపంచంలో రారాజుగా నిలుస్తున్నాడు.
బాల్యంలో టీవీ నుంచి దృష్టి మరల్చేందుకు చదరంగ బోర్డును అతనికి పరిచయం చేస్తే.. ఇప్పుడు చెస్ ప్రపంచాన్ని ఏలే దిశగా ప్రజ్ఞానంద సాగుతున్నాడు. 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా ప్రకంపనలు సృష్టించిన ఈ స్టార్ ప్లేయర్.. ప్రముఖ కోచ్ ఆర్‌బీ రమేశ్ శిక్షణలో, ఆనంద్ మార్గనిర్దేశకాలతో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. 14 ఏళ్లకే 2600 ఎలో రేటింగ్‌ను సాధించాడు. మధ్యలో కరోనా స్పీడ్ బ్రేకర్‌లా వచ్చినప్పటికీ.. ఆన్‌లైన్ టోర్నీల్లో ఆడుతూ తన ఫామ్‌ను కొనసాగించాడు.