రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో భాగంగా పరారీలో ఉన్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌తో పాటు మరో తొమ్మిది మందికి దిల్లీ కోర్టు, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతకముందు సుశీల్ కోసం లుక్ఔట్ నోటీసులు కూడా పంపింది.
నగదు ప్రకటన
అజ్ఞాతంలో ఉన్న సుశీల్‌పై నగదు బహుమతి ప్రకటించేందుకు సిద్ధమయినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. "అతడిపై కేసు నమోదు చేశాక నోటీసులు పంపించాం. కానీ అతడు ఫోన్ స్విచ్ఛ్ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నాడు. అతడి స్నేహితుల ఇళ్లలో కూడా వెతికాం. కానీ అతడి జాడ తెలియలేదు. కాబట్టి అతడిపై రివార్డు ప్రకటించాలని నిర్ణయించుకున్నాం" అని ఆ అధికారి వెల్లడించారు.
ఇదీ వివాదం
ఈ నెల 4న సాగర్‌తో పాటు అతడి ఇద్దరు మిత్రులపై దిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణలో సుశీల్ బృందం హాకీ, బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడింది. అప్పుడు తలకు తీవ్ర గాయమై సాగర్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో సుశీల్ పాల్గొన్నట్లు వీడియో ఆధారాలు కూడా ఉన్నట్లు వారు వెల్లడించారు. సాగర్ మృతి వార్త బయటికి రాగానే సుశీల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం దిల్లీ, హరియాణా సహా పలు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ వారి చేతికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు గురుగ్రామ్‌లోని ఓ ప్లాట్‌లో తలదాచుకున్నట్లు శనివారం తెలుసుకున్న పోలీసులు అక్కడ వెతకగా కనిపించలేదు.
ఇదీ చూడండి: 'గురువుగా భావించిన వ్యక్తే ప్రాణాలు తీశాడు!'