టోక్యో ఒలింపిక్స్లో సత్తా చాటి భారత కీర్తిప్రతిష్టలను ప్రపంచస్థాయికి చేర్చిన అథ్లెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఒలింపిక్స్లో పతకాలు సాధించి.. యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు మోదీ. అనంతరం జాతినుద్దేశించి ప్రసగించారు. అథ్లెట్లు పతకాలు సాధించి.. నవయువ భారతావనిలో స్ఫూర్తినింపారని పేర్కొన్నారు మోదీ. వారికి దేశం మొత్తం గౌరవం ప్రకటిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్స్ బృందానికి సెల్యూట్ చేశారు. ఎర్రకోటకు హాజరైన అతిథులు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.