ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా ఎంతోమంది సింగర్స్‌కు అండగా నిలిచారు. కానీ మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్, గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కెరీర్ తోడ్పటులోనూ ఆయన పరోక్ష పాత్ర పోషించారని చాలా మందికి తెలియకపోవచ్చు.
శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు బాలు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా, బాలుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
"గొప్ప స్థాయిలో ఉన్నా సరే బాలు, చాలా సాదాసీదా మనిషిలా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధగా పుంది. 1983లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మా జట్టుకు(చెన్నై కోల్ట్స్) స్పాన్సర్ చేసింది ఆయనే. అలా నా మొదటి స్పాన్సర్ బాలు అయ్యారు. నేను కలిసిన అతికొద్ది మంచివాళ్లలో ఆయన ఒకరు"
విశ్వనాథన్ ఆనంద్, మాజీ ఛెస్ ఛాంపియన్
ప్రముఖ కవి ఆరుద్ర.. అప్పటి మద్రాస్ చెస్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో బాలుర చెస్ జట్టును నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు తీసుకెళ్లేందుకు నిధుల కొరత ఏర్పడటం వల్ల బాలుతో మాట్లాడారు ఆరుద్ర. విషయం తెలుసుకున్న వెంటనే బాలు చెక్ రాసిచ్చారు.