ఒకటీరెండూ కాదు, ఏకంగా మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాల్ని ఒకేరోజు సొంతం చేసుకుంది భారతీయ ఆర్చర్ దీపికా కుమారి(Deepika Kumari). ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్‌గా ఉన్న దీపిక.. టోక్యో ఒలింపిక్స్‌కు(Tokyo olympics) వెళ్లిన ఏకైక భారతీయ మహిళా ఆర్చర్. మూడోసారి ఒలింపిక్స్ ఆడుతున్న ఈ ఝార్ఖండ్ అమ్మాయి తన చిరకాల స్వప్నమైన ఒలింపిక్ పతకం గెలిచి విజయ గీతిక మోగిస్తానంటోంది!
చిన్నపుడు దీపిక స్నేహితురాళ్ల బృందంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉండేది. అందుకు కారణం ఆమెకున్న ఓ అసాధారణ ప్రతిభ. చిటారు కొమ్మన ఉండే మామిడి కాయల్ని గురిచూసి రాయితో, ఉండేలుతో ఎంతో సులభంగా కొట్టేది. వేసవి వచ్చిందంటే ఆ స్నేహితుల బృందానికి ఇదే పని. ఆ నైపుణ్యం ఆమెను ఒలింపిక్స్ వరకూ తీసుకువెళ్తుందని ఆరోజు ఆ చిన్నారి ఊహించి ఉండదు. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి 15 కి.మీ. దూరంలోని 'రాటు చట్టీ' దీపిక పుట్టిన ఊరు. తండ్రి శివ్‌నారాయణ్ మహతో ఆటో నడిపేవారు. తల్లి గీత రాంచీ మెడికల్ కాలేజీలో నర్సు. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినపుడు వరసకు అక్క అయ్యే విద్యాకుమారి చేతిలో బాణం చూసింది దీపిక. అది వెదురుతో చేసిన బాణం కాదు, విదేశాల్లో తయారైన ఆధునిక బాణం.
ప్రఖ్యాత 'టాటా ఆర్చరీ అకాడమీ'లో శిక్షణ తీసుకుంటోంది విద్య. ఆ బాణం గురించీ విలువిద్య గురించీ ఆమెను అనేక ప్రశ్నలు అడిగింది దీపిక. అవన్నీ తెలుసుకున్నాక తానూ ఆర్చర్ అవుతానంది. ఏటా స్కూల్ విద్యార్థులకు ఎంపిక పరీక్షలు జరుగుతాయంటూ ఓసారి వెళ్లమని చెప్పిందామె. ఆ తర్వాత నుంచీ వెదురు బాణం, విల్లంబులు పట్టుకుని ప్రాక్టీసుచేయడం మొదలుపెట్టింది దీపిక. రాంచీకి 120 కి.మీ. దూరంలోని జిల్లా కేంద్రమైన సెరైకలాలో 'అర్జున ఆర్చరీ అకాడమీ'లో ప్రవేశ పరీక్షకు వెళ్లింది.
కేంద్ర మంత్రి అర్జున్ ముండా భార్య మీరా దాని నిర్వహకురాలు. ఆ పోటీల్లో దీపికను చూసిన మీరా అకాడమీలో చోటిచ్చారు. 2007లో అక్కడ చేరి ఆర్చరీలో ఓనమాలు నేర్చుకుంది దీపిక. కానీ ఆమె తల్లిదండ్రులకు అది ఇష్టంలేదు. దీపికను డాక్టర్‌గా చూడాలనేది ఆమె తల్లి కోరిక. దీపికకు అప్పటికి పదమూడేళ్లు. అంత చిన్న వయసులో ఆడపిల్ల బయట ఉండగలదా అనేది తండ్రి భయం. దాంతో అయిష్టంగానే ఆమెను పంపారు.
భారం తగ్గుతుందని..
"పేదరికం మనుషుల్ని ధైర్యవంతులుగా మార్చుతుంది లేదా బిడియస్తులుగా తయారుచేస్తుంది. ఇంట్లో మూడుపూటలా తినడానికి ఉండేది కాదు. అంతమాత్రాన నేను కలలు గనడం ఆపలేదు. నా కలల్ని నిజం చేసుకోవాలంటే అమ్మానాన్నలను వదిలి వెళ్లాల్సిందేనని అర్థమైంది. అకాడమీకి వెళ్తే నా కలల్ని నిజం చేసుకోవడమేకాదు, ఇంట్లో వాళ్లమీద ఆర్థిక భారం తగ్గించవచ్చనుకున్నా. ఆ సమయంలో నాకెవరూ మార్గనిర్దేశం చేయలేదు. కానీ నాకు దేన్నైనా గురిచూసి కొట్టడమంటే ఇష్టం. ఆ ఒక్క విషయమే ఆర్చరీ అకాడమీలో చేరేలా చేసింది. అక్కడ కొత్త మనుషులు, కొత్త భాష. అలవాటు పడ్డానికి చాలా రోజులు పట్టింది. అరకొర సదుపాయాలు. అయినా ఓపికతో కొనసాగాను. నా ప్రదర్శన మెరుగయ్యే కొద్దీ, నా కలలు కూడా పెద్దవయ్యాయి. కొన్నిసార్లు జీవితం మన శక్తికి మించిన సవాళ్లు విసురుతుంది. వాటిని స్వీకరిస్తే అసాధ్యమనేదే ఉండదు" అని చెబుతుంది దీపిక.
టాటా అకాడమీలో చేరిక..
అర్జున అకాడమీలో శిక్షణ తీసుకుంటూ జూనియర్ విభాగంలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతంగా రాణించింది దీపిక. ఈ పోటీల్లో ఆమెను చూసిన కోచ్ ఒకరు టాటా ఆర్చరీ అకాడమీలో చేరమని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ ఆర్చరీ అకాడమీల్లో అదొకటి. ఆమె లక్ష్యం కూడా అక్కడ చేరడమే. 2008లో మొదటి ప్రయత్నంలోనే సీటు సంపాదించింది. దాంతో తన కల నిజమైందని ఎంతో సంబరపడింది దీపిక. అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ దొరకడమే కాదు, నాణ్యమైన భోజనమూ లభిస్తుంది. రోజూ 300 విల్లంబులు దాకా సంధించాలంటే పోషకాహారమూ ముఖ్యమే మరి. దానికి తోడు నెలకు రూ.500 ఉపకారవేతనం. తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇదో గొప్ప అవకాశం అనుకుంది దీపిక. అక్కడ అత్యుత్తమ శిక్షకులతోపాటు స్ఫూర్తినిచ్చే క్రీడాకారులూ ఉంటారు.
ఆ స్ఫూర్తితోనే 2009లో అమెరికాలో జరిగిన యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్(అండర్-16) పోటీల్లో స్వర్ణం గెలిచి 15 ఏళ్లకే ఆర్చరీలో తన రాకను ఘనంగా చాటింది దీపిక. అదే వేదికమీద డోలా బెనర్జీ, బోంబయాలా దేవీలతో కలిసి మహిళల(బృందం) విభాగంలో స్వర్ణం గెలిచింది. అప్పటివరకూ కూతురు గురించి ఆందోళన పడుతూ వచ్చిన దీపిక తల్లిదండ్రులు ఆ తర్వాతే తమ మనసు మార్చుకున్నారు. జంషెడ్‌పూర్ నుంచి తమ ఊరు రెండు గంటల ప్రయాణ దూరంలోనే ఉన్నా లక్ష్య సాధనకోసం రెండేళ్లపాటు ఇంటి ముఖం చూడలేదు దీపిక.
"ఆర్చరీ గురించి నాకు మొదట్లో అస్సలు తెలీదు. కానీ ప్రాక్టీసు చేస్తున్నకొద్దీ ఆటపైన ఇష్టం పెరిగింది. టాటా అకాడమీలో డోలా బెనర్జీ అక్కను చూస్తూ పెరిగాను. కెరీర్ పరంగా ఆమె నాకెంతో సాయపడింది. ఆమె నా రోల్‌మోడల్" అంటుంది దీపిక.
రెండు ఛాన్సులు మిస్సయ్యాయి..
2010 దిల్లీ కామన్వెల్త్ క్రీడలతో దీపిక స్టార్ అథ్లెట్ల జాబితాలో చేరిపోయింది. ఆ పోటీల్లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో స్వర్ణాలు గెలిచి స్వదేశీ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. అదే ఏడాది గౌంగ్జూ(చైనా) ఆసియా గేమ్స్‌లో రజతం గెలిచింది. అది మొదలు అంతర్జాతీయ వేదికల మీద వరుసగా పతకాలు గెలుస్తూ వచ్చింది దీపిక.
"2012లో వరల్డ్ ఛాంపియన్ స్వర్ణం గెలిచాక చాలా సంతోషపడ్డా. ఆ గెలుపుతో నంబర్‌వన్ ర్యాంకునూ సంపాదించా. కానీ కోచ్ మాత్రం 'దాన్ని మర్చిపో, ఒలింపిక్స్ మీద దృష్టి పెట్టు' అన్నారు. కొన్ని రోజులైనా ఈ విజయాన్ని ఆస్వాదించే అవకాశం ఇవ్వొచ్చుగా అనుకునేదాన్ని. కానీ తర్వాత అర్థమైంది.. క్రీడాకారులకు గతంకంటే భవిష్యత్తు ముఖ్యమని. ఆరోజు నుంచీ నా విజయాన్ని ఆస్వాదించడానికి ఒక్కరోజే కేటాయిస్తా. మరుసటిరోజే తర్వాత పోటీ మీద దృష్టిపెడతా" అని చెబుతుంది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో దీపిక పతకం తెస్తుందని క్రీడాభిమానులు ఆశించారు. కానీ మొదటి రౌండ్‌లోనే వైదొలగడం వల్ల అందరికీ నిరాశ ఎదురైంది. "నాకపుడు 18 ఏళ్లు. ఒలింపిక్స్‌లో పాల్గొనడం కలా నిజమా అన్నట్టు ఉండేది. అంతలోనే తేరుకుని లక్ష్యంమీద దృష్టి పెట్టినా అనుకున్న ఫలితం రాలేదు. చాలా కష్టపడ్డాననుకున్నా, కానీ మెరుగుపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తర్వాత అర్థమైంది. కానీ అది ఎంతో విలువైన అనుభవం" అంటుంది దీపిక.
ఆ తర్వాత కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుస్తూ వచ్చింది దీపిక. కానీ, 2016 రియో ఒలింపిక్స్ మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈసారి క్వార్టర్స్ వరకు మాత్రమే వెళ్లగలిగింది. 'నిర్భయంగా ఆడటం, తోటివారికంటే కొన్ని క్షణాలు ఎక్కువగా లక్ష్యాన్ని ఏకాగ్రతతో చూడగలగడం.. ఇవన్నీ దీపికకు కలిసొచ్చే అంశాలే. వీటికితోడు అదృష్టమూ ఉండాలి' అంటారు ఆమెను దగ్గరగా చూసినవాళ్లు.
ఒలింపిక్స్ కోసం పెళ్లి వాయిదా..
ఒక్క ఒలింపిక్స్ మినహా అన్ని అంతర్జాతీయ పోటీల్లో రాణించడం వల్ల 2016లో పద్మశ్రీ అవార్డునీ అందుకుంది దీపిక. 2018లో సహచర ఆటగాడు అతాను దాస్‌తో(Atanu Das) దీపికకు ఎంగేజ్‌మెంట్ అయింది. తమ ఒలింపిక్స్ లక్ష్యానికి వ్యక్తిగత జీవితం అడ్డంకి కాకూడదనుకుని వివాహాన్ని వాయిదా వేశారు. గతేడాది ఒలింపిక్స్ వాయిదాతో దొరికిన సమయంలో పెళ్లి చేసుకున్నారు. "పెళ్లి తర్వాత చాలా సమయం కుటుంబ సభ్యులతో గడిపాం. ఇంటి భోజనం, చుట్టరికాలూ మొదట్లో బావుండేది. కానీ కొద్ది నెలలకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. ప్రతిరోజునూ విలువైనదిగా భావిస్తూ వచ్చిన నాకు ఎలాంటి ప్రణాళికా లేకుండా నెలలకు నెలలు గడిచిపోవడం వల్ల టెన్షన్ వచ్చేది" అని చెబుతుంది దీపిక.
అతాను దాస్, దీపికా కుమారి ఈమెతోపాటు భర్త అతాను కూడా టోక్యో ఒలింపిక్స్‌కు 2019 నాటికే అర్హత సాధించాడు. మనదేశం నుంచి ఈ ఘనత సాధించిన మొదటి జంట వీరే. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు సడలించాక ఆర్చరీ పోటీలు మళ్లీ మొదలయ్యాయి. మార్చి నుంచి వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్‌కు అవసరమైన అనుభవాన్ని సంపాదించింది దీపిక.
పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకేరోజు మూడు (సింగిల్స్, మిక్సిడ్, టీమ్) విభాగాల్లో స్వర్ణాలు సాధించింది. సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు సంపాదించింది. "ప్రపంచకప్ గెలుపు మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. లోటుపాట్లను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. నా ప్రదర్శన ఇంకాస్త మెరుగవ్వాలి కూడా. ఎందుకంటే రాబోయే టోర్నీ ఎంతో కీలకమైంది. ఈసారి ఒలింపిక్ పతకం గెలిచి భారత్‌లో ఆర్చరీని ప్రత్యేక స్థానంలో నిలపాలన్నది నా లక్ష్యం" అంటోన్న దీపిక కెరీర్ సగటు గతేడాది వరకూ 9.09గా ఉండేది. 2021లో 9.29గా మెరుగుపడటం సహా ఆత్మవిశ్వాసం పెరిగింది, నిలకడగా రాణిస్తోంది. జీవితం చాలా కొద్దిసార్లు మాత్రమే చరిత్రను మార్చే అవకాశం ఇస్తుంది. టోక్యో ఒలింపిక్స్ దీపికకు అలాంటి అవకాశమే అవ్వాలని కోరుకుందాం.
ఆరేళ్లు మాటల్లేవ్..
దీపికా, అతాను టాటా ఆర్చరీ అకాడమీలో ఒకేసారి చేరారు. మిక్స్‌డ్ విభాగంలో కలిసి ప్రాక్టీసు చేసేవారు. అతాను.. బెంగాలీ. తనకు అప్పట్లో హిందీ రాదు. ఒకే దగ్గర ఉన్నా ఆ కారణంతో ఇద్దరూ మాట్లాడుకోలేదు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కానీ 2012లో జరిగిన ఏదో చిన్న సంఘటనతో ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. వారి మధ్య ఆరేళ్లు మాటల్లేవ్. 2017లో మళ్లీ మాటలు కలిశాయి. అన్నాళ్లు ఏం కోల్పోయారో అర్థమైంది. దాంతో ప్రేమలో పడ్డారు. 2018లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గతేడాది జూన్‌లో పెళ్లిచేసుకున్నారు.
ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటూ మెరుగుపడ్డామని చెబుతారిద్దరూ. అతాను గెలుపోటముల్ని ఒకే రకంగా తీసుకుంటాడనీ ఆ విషయంలో అతడిని చూసి తానూ కొంత మెరుగుపడ్డానంటుంది దీపిక. లక్ష్యానికి గురిపెట్టేటపుడు దీపిక కొన్ని సెకన్లపాటు ఎంతో ఏకాగ్రతతో ఉంటుందనీ, అప్పుడు పక్షి కన్ను చూస్తున్న అర్జునుడే గుర్తొస్తాడనీ ఆమె నుంచి ఏకాగ్రత విషయంలో టిప్స్ నేర్చుకున్నాననీ, 'ఏదైనా సాధించాలి అంటే, సాధించాల్సిందే' అనే తన పట్టుదల కూడా నచ్చుతుందనీ చెబుతాడు అతాను. 'మేం కలిసి ప్రాక్టీసు కెళతాం. ఇంట్లోనూ ఆట గురించి చర్చిస్తాం' అంటుంది దీపిక.
ఇదీ చూడండి..బ్యాడ్మింటన్‌లో 'హ్యాట్రిక్' కొట్టేనా? సింధుపైనే కోటి ఆశలు