ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి కరోనా సెగ తగిలింది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 3న జరగాల్సిన వేడుకను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. త్వరలో తేదీ, సమయం వెల్లడించనున్నట్లు తెలిపింది. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమక్షంలో.. 2020 పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సింది. ఈ ఏడాది పద్మ పురస్కారాలకు 141 మంది ఎంపికయ్యారు.
పద్మ గ్రహీతలు వీరే...
దేశంలో వివిధరంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు.. కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ఇస్తుంది. 2020వ ఏడాదికిగానూ ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను అందించనుంది.
కేంద్ర మాజీ మంత్రులు జార్జ్ ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ , కళారంగంలో యూపీకి చెందిన చన్నౌలాల్ మిశ్రా, కర్ణాటకలో ఉడిపి మఠానికి చెందిన దివంగత ఆధ్యాత్మికవేత్త విశ్వేషతీర్థ స్వామీజీ, మారిషస్‌కు చెందిన అనిరుద్ జుగ్నౌత్‌కు పద్మవిభూషణ్ ప్రకటించారు.
'పద్మ' వరించిన మరికొందరు..
- తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్ అధినేత వేణు శ్రీనివాసన్, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు పద్మ విభూషణ్ ప్రకటించారు.
- మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్, ప్రస్తుత భారత హాకీ జాతీయ మహిళాజట్టు సారథి రాణిరాంపాల్, షూటర్ జీతూరాయ్‌తో పాటు ఆరుగురు క్రీడాకారులకు పద్మశ్రీ ఇవ్వనున్నారు.
- సినీరంగంలో కరణ్‌జోహార్, ఏక్తాకపూర్, కంగనారనౌత్‌తో పాటు ఆరుగురిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యడ్ల గోపాల్ రావు, దళవాయి చలపతిరావు, తెలంగాణ నుంచి విజయ సారథి శ్రీభాష్యం, చింతల వెంకటరెడ్డిలకు పద్మశ్రీ అందించనున్నారు.
మొత్తం 118 మందికి పద్మశ్రీ ప్రకటించగా అందులో 21 మంది సామాన్యులున్నారు. ఆయా రంగాల్లో చేసిన సామాజిక సేవకు గాను వీరందరినీ పద్మశ్రీ వరించింది. పద్మపురస్కారాలు అందుకోనున్న వారిలో.. 34 మంది మహిళలున్నారు. 18 మంది విదేశీయులు కూడా ఉన్నారు.