అభినవ్ బింద్రా.. ఈ పేరు వింటే భారత క్రీడాభిమానుల హృదయాలు ఉప్పొంగుతాయి. అతను పుష్కరం కిందట సాధించిన అద్భుత ఘనత కళ్లముందు కదలాడుతుంది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం కోసం దశాబ్దాలుగా సాగుతున్న నిరీక్షణకు తెరదించిన ఘనుడతను. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటింగ్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ ఘనతకు ఆగస్టు 11తో పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఒలింపిక్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. బీజింగ్ స్వర్ణం గెలిచాక తాను ఆటలో కొనసాగేందుకు ప్రేరణ కోల్పోయినట్లు చెప్పాడు.
అంత పెద్ద విజయం సాధించాక ఏం చేయాలో పాలుపోలేదని.. దీంతో షూటింగ్ వదిలేసి వేరే లక్ష్యాన్ని ఎంచుకుందామా అన్న ఆలోచన కలిగిందని అన్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని ఇదే ఆటలో కొనసాగినట్లు వెల్లడించాడు.
"కొంత కాలం తర్వాత నేను గెలిచిన స్వర్ణ పతకం నా జేబులో ఉండగా.. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురైంది. ఒక గొప్ప విజయం సాధించాక ఆ తర్వాత గమ్యం ఎక్కడో అర్థం కాలేదు. నేను పూర్తిగా ప్రేరణ కోల్పోయా. అది చాలా కఠినమైన దశ. అత్యున్నత విజయాన్నందుకున్నాక మానసికంగా అథమ స్థాయికి చేరడం అథ్లెట్లలో కొత్తేమీ కాదు. అంతకుముందు వరకు మనకు ఒక లక్ష్యం ఉంటుంది. దాని కోసం కష్టపడతాం. అయితే మన కల నెరవేరాక అంతా అయిపోయిందనిపిస్తుంది. బీజింగ్ విజయం తర్వాత ఒక దశలో నేను ఆటను వదిలేసి వేరే మార్గంలోకి వెళ్లాలనుకున్నా. కొత్త లక్ష్యం పెట్టుకోవాలనుకున్నా. పది రోజుల పాటు ధ్యాన కార్యక్రమానికి వెళ్లా. రోజుకు ఏడు గంటలు ధ్యానం చేసేవాళ్లం. పది రోజుల పాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉన్నాం. నా కొత్త లక్ష్యం కోసమే ఆ పని చేశా.
అభినవ్ బింద్రా, భారత అథ్లెట్
ఆ పది రోజుల తర్వాత తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడమే తర్వాతి లక్ష్యంగా అనిపించినట్లు తెలిపాడు. తనలో ఆటపై ఇంకా ప్రేమ ఉందని అప్పడే అర్థమైందని పేర్కొన్నాడు. అలా ఒలింపిక్ కలను కొనసాగిస్తూ ఇంకో రెండు గేమ్స్‌లో పాల్గొన్నట్లు వివరించారు బింద్రా.