టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అంతకంటే ముందే సాఫ్ట్‌బాల్, ఆర్చరీ.. వంటి క్రీడలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఒలింపిక్స్‌లో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు, విశేషాలు.. మీకోసం.
సియోల్ ఒలింపిక్స్-1988
- డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఉత్తర కొరియా) ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. క్యూబా, ఇథియోపియా, నికరగువా విశ్వక్రీడల్లో చేరాయి.
- 64 ఏళ్ల తర్వాత టెన్నిస్‌ను తిరిగి ఈ విశ్వ క్రీడల్లో ప్రవేశపెట్టారు. ఈసారి ప్రొఫెషనల్ క్రీడాకారులకు అవకాశం కల్పించారు. ఇందులో పాల్గొన్న జర్మనీ టెన్నిస్ ప్లేయర్ స్టెఫీ గ్రాఫ్ స్వర్ణంతో గ్రాండ్‌స్లామ్ సీజన్‌కు వీడ్కోలు చెప్పింది.
- డ్రగ్స్‌ను వాడినందుకు గానూ పది మంది అథ్లెట్లను ఈ మెగా ఈవెంట్ నుంచి నిషేధించారు.
- స్వీడన్ ఫెన్సర్ కెర్స్టిన్ పామ్.. ఏడు ఒలింపిక్స్ల్లో పాల్గొన్న తొలి మహిళగా సరికొత్త రికార్డు సృష్టించింది.
- గుర్రపు పందేలలో తొలిసారిగా మూడు పతకాలు మహిళలకే దక్కాయి.
- 100 మీ. పరుగులో కెనడా స్ప్రింటర్ బెన్ జాన్సన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. కానీ, అతడు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గానూ అతడిపై అనర్హత వేటు పడింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అమెరికా అథ్లెట్ కార్ల్ లూయిస్‌కు పసిడి దక్కింది. అంతకుముందు 1984 విశ్వక్రీడల్లోనూ లూయిస్ స్వర్ణంతో మెరిశాడు. దీంతో వరుసగా రెండు సార్లు బంగారు పతకం అతడికి దక్కినట్లైంది.
- పోల్ వాల్ట్ క్రీడలో సోవియట్ ప్లేయర్ సర్గే బుబ్కా తొలి గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాడు.
- రొమేనియా జిమ్నాస్ట్ ప్లేయర్ డానియల్ సిలివాస్ ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశీయుడు నదియా కొమనేసి రికార్డును సమం చేశాడు.
ఇదీ చదవండి:Tokyo Olympics Medals: పతకాల వేటలో.. ఎవరిది పైచేయి?
బార్సిలోనా ఒలింపిక్స్-1992
- 32 ఏళ్ల నిషేధం అనంతరం సౌతాఫ్రికా తిరిగి విశ్వక్రీడల్లో పాల్గొంది.
- తొలిసారిగా బాణం సహాయంతో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు.
- 1964 ఒలింపిక్స్ తర్వాత తిరిగి బార్సిలోనా విశ్వక్రీడల్లో జర్మనీ ఒకే దేశంగా బరిలోకి దిగింది.
- బ్యాడ్మింటన్, మహిళల జూడో క్రీడలు ఒలింపిక్స్‌లోకి ప్రవేశించాయి.
- ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన అత్యంత పిన్న వయస్కురాలిగా చైనా డైవింగ్ క్రీడాకారిణి ఫు మింగ్క్సియా నిలిచింది. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్లు.
- 1991లో సోవియట్ యూనియన్ రద్దైంది. దీంతో 1936 తర్వాత ఇస్తోనియా, లాత్వియా, లిథువేనియా.. వంటి దేశాలు తమ సొంత జట్లను ఒలింపిక్స్‌కు పంపాయి.
- సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా విడిపోయిన తర్వాత క్రొయేషియా, స్లోవేనియా, బోస్నియా, హెర్జగోవియా తొలి సారిగా విశ్వక్రీడల్లో పాల్గొన్నాయి.
- గ్రేట్ బ్రిటన్ స్ప్రింటర్ డెరెక్ రెడ్మండ్.. 400మీ. పరుగు మధ్యలో గాయపడ్డాడు. డెరెక్ బాధ చూడలేక అతడి తండ్రి ట్రాక్‌లోకి దిగి లక్ష్యాన్ని పూర్తి చేయడానికి సాయమందించాడు. దీంతో స్టేడియంలోని ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు.
అట్లాంటా ఒలింపిక్స్-1996
- బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఒలింపిక్ జ్యోతిని వెలిగించాడు.
- ఒలింపిక్ చరిత్రలో మొదటిసారి గుర్తింపు పొందిన 197 జాతీయ ఒలింపిక్ కమిటీలు ఆటలకు ప్రాతినిధ్యం వహించాయి.
- బీచ్ వాలీబాల్, మౌంటైన్ బైకింగ్, రోయింగ్, మహిళల ఫుట్‌బాల్ వంటి క్రీడలు ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశించాయి.
- అట్లాంటాలో తొలిసారిగా 24 దేశాలు అరంగేట్రం చేశాయి. వాటిలో 11 సోవియట్ రిపబ్లిక్ దేశాలు స్వతంత్ర దేశాలుగా పాల్గొన్నాయి.
- అమెరికా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ అగస్సీ.. ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
- ఆస్ట్రియా నావికుడు హుబెర్ట్ రౌడాచ్ల్ అత్యధికంగా తొమ్మిది ఆటలలో పాల్గొన్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు అతడే.
- ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో తొమ్మిదో సారి గోల్డ్ మెడల్‌ను గెలుచుకున్నాడు అమెరికా స్ప్రింటర్ కార్ల్ లూయిస్.
ఇదీ చదవండి:Olympics: ర్యాంకింగ్ రౌండ్‌ను 9వ స్థానంతో ముగించిన దీపిక