దేశంలోని క్రీడాకారుల సౌకర్యార్థం సెంట్రల్ అథ్లెట్ ఇంజూరీ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఏఐఎంఎస్)ను.. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి పునరావాసం కల్పించడమే కాకుండా క్రీడాకారులకు ఔషధ సదుపాయాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఎస్కేఎస్ మార్య, దిన్షా పర్దివాలా, బీవీ శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నిపుణలు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
గాయపడిన అథ్లెట్లను భౌగోళికంగా దగ్గర్లో ఉన్న కేంద్రానికి పంపించడం సీఏఐఎంఎస్ ముఖ్య లక్ష్యం. దేశవ్యాప్తంగా క్రీడాకారులకు తగిన చికిత్స అందించేందుకు ఈ విధానం సహాయపడనుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్‌లో భాగమైన అథ్లెట్లకు మద్దతు ప్రకటించడం కోసం ఈ సీఏఐఎంఎస్ను ప్రారంభించారు.