తెలంగాణ

telangana

ETV Bharat / sports

OLYMPIC MEDAL WINNERS: ఒలింపిక్స్‌లో.. చెరగని సంతకాలు! - ఒలింపిక్‌ పతకాన్ని గెలిచిన తొలి మహిళ

వాళ్ల రికార్డులని తిరగరాయడం అంత సులభం కాదు...  మగవాళ్లతో పోటీపడ్డారు... వైకల్యాన్ని జయించారు... కష్టాలకు ఎదురీదారు...  గెలుపుకోసం పరితపించి తిరుగులేని విజయాలని సొంతం చేసుకున్నారు. 125 ఏళ్ల ఒలింపిక్‌ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాలు లిఖించుకున్న క్రీడా జ్యోతుల్లో కొందరి కొందరి మననం ఇదీ...

olympic-medal-winners-special-story
ఒలింపిక్స్‌లో.. చెరగని సంతకాలు!

By

Published : Jul 23, 2021, 7:17 AM IST

Updated : Jul 23, 2021, 8:08 AM IST

ఒలింపిక్‌ కోలాహలం ఇవాళే మొదలు... 1900 సంవత్సరంలో 2.2తో మొదలైన మహిళా ప్రాతినిథ్యం 49శాతానికి చేరుకునేటప్పటికి 2021 వచ్చింది. ఆకాశంలో సగమని చెప్పే మనం ఈ విశ్వ క్రీడల్లో సగానికి చేరుకునేటప్పటికి 125 ఏళ్లు పట్టింది!! ఆధునిక ఒలింపిక్స్‌ 1896లో మొదలయ్యాయి. వీటిలో పాల్గొనే అవకాశాన్ని మహిళలకు ఇవ్వలేదు. రెండోది అంటే... 1900లో పారిస్‌ ఒలింపిక్స్‌లో మొదటి మహిళ కాలుమోపింది. ‘హెలెన్‌ డి పౌర్టాలస్‌’ యాట్‌ బృందంలో సభ్యురాలిగా పాల్గొంది. అంతే కాదు ఒలింపిక్‌ పతకాన్ని గెలిచిన తొలి మహిళగానూ నిలిచింది. ఈమె బంగారు, వెండి పతకాలను గెలుచుకుంది.

3 పోటీలు, 18 పతకాలు...

లారిసా లాటినినా సోవియట్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్ట్‌. తనకు 11 నెలల వయసులో తండ్రి ఈమెనీ, తల్లినీ వదిలేసి వెళ్లిపోయాడు. నిరక్షరాస్యురాలైన తల్లే పెంచింది. ఆసక్తి మేరకు బ్యాలే నేర్చుకుని, తర్వాత జిమ్నాస్ట్‌గా మారింది. 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టింది. 1956లో, 21 ఏళ్ల వయసులో మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో మొదటిసారిగా పాల్గొని బంగారు పతకాన్ని గెల్చుకుంది. మొత్తంగా మూడు ఒలింపిక్‌ పోటీల్లో 18 పతకాలను గెల్చుకుని అత్యధిక పతకాల రికార్డును నెలకొల్పింది. 2012లో అమెరికన్‌ స్విమ్మర్‌ మైఖేల్‌ ఫెల్ఫ్స్‌ ఈమె రికార్డును బద్దలుకొట్టాడు. అంటే.. లారిసా ఘనతను మరొకరు అందుకోవడానికి 48 ఏళ్లు పట్టిందన్నమాట!

మగవాళ్లతో పోటీపడి..

బేబ్‌ డిడ్రిక్సన్‌ జహారియాస్‌... ముద్దుపేరు బేబ్‌. పుట్టింది టెక్సాస్‌లో. చిన్నప్పుడు ఇరుగుపొరుగు మగపిల్లలతో కొట్లాడి గెలిచిన అనుభవమే ఆమె క్రీడల్లోకి రావడానికి కారణమయ్యిందట. క్రీడారంగం ‘లెజెండ్‌’గా కీర్తించే గొప్ప క్రీడాకారిణి ఈమె. సాధారణంగా ఏదో ఒక ఆటలో రాణించే వాళ్లని చూస్తుంటాం. బేబ్‌ అలాకాదు. బాస్కెట్‌బాల్‌, ట్రాక్‌, గోల్ఫ్‌, బేస్‌బాల్‌, ఈత, డైవింగ్‌, బాక్సింగ్‌, బిలియర్డ్స్‌, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, స్కేటింగ్‌ ఇలా ఆమె అడుగుపెట్టని ఆటంటూ లేదు. 1932 ఒలింపిక్స్‌లో ఆమె అడుగుపెడుతూనే సాధించిన విజయాలు సంచలనం సృష్టించాయి. అవకాశం ఇచ్చిన ప్రతి ఈవెంట్‌లోనూ పతకాలు గెల్చింది. మగవాళ్లతో పోటీపడి వాళ్ల రికార్డులనీ బద్దలుకొట్టింది. 2021 ఒలింపిక్స్‌లో ఎవరైనా ఆమె రికార్డులని బద్దలుకొడతారేమో చూడాలి.

వైకల్యాన్ని గెలిచిన టోర్నడో...

విల్మా రుడాల్ఫ్‌ని ట్రాక్‌లో కనిపించే ‘టోర్నడో’ అని పిలుస్తారంతా. భూమ్మీద అత్యంత వేగంగా పరుగెత్తే మహిళగా పేరున్న విల్మా... 22 మంది సంతానంలో ఒకరు. పేదరికం... ఆకలి కారణంగా బాల్యంలో అనారోగ్యం పాలై కాలికి అమర్చిన పరికరాల సాయంతో నడిచేది. ‘డాక్టర్‌ నన్ను జీవితంలో నడవలేవు అన్నాడు. అమ్మ మాత్రం నువ్వు పరుగుపెడతావు అంది. నాకు అమ్మ మాటపైనే గురి. అందుకే వైకల్యాన్ని గెలిచాను’ అనే విల్మా... తర్వాత ఒలింపిక్స్‌ పరుగులో స్వర్ణాలు గెల్చుకుని టోర్నడో అనిపించుకుంది.

మన మల్లీశ్వరి!

ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా అథ్లెట్‌ నీలిమ ఘోష్‌. 1952 హెల్సింకీ లో జరిగిన ఈ పోటీలకు ఎంపికైనప్పుడు తన వయసు 17 ఏళ్లే! తరువాత చాలా మంది మహిళలు పాల్గొన్నా పతకం తెచ్చింది మాత్రం... కరణం మల్లీశ్వరే. తనది ఆంధ్రప్రదేశ్‌లోని వూసవాని పేట అనే చిన్న పల్లెటూరు. 12 ఏళ్ల వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రారంభించింది. ఎన్నో అంతర్జాతీయ పతకాలను గెలుచుకుంది. 2000 సిడ్నీలో కాంస్యాన్ని గెలిచింది. దేశం తరఫున ఒలింపిక్‌ పతకాన్ని సాధించిన తొలి మహిళగానూ నిలిచింది. ‘ఐరన్‌ లేడీ’గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ దేశానికి పతకాన్ని సాధించిన ఏకైక విమెన్‌ వెయిట్‌ లిఫ్టర్‌గా రికార్డు ఆమెదే!

తరువాత... సైనా నెహ్వాల్‌, మేరీ కోం, పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు వారి క్రీడల్లో దేశానికి పతకాలు సాధించిపెట్టారు. వీరి విజయాలు ఎందరో అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన జట్టులో 56 మంది మహిళలు. వీలైనంత ఎక్కువ మంది పతకాలు సాధించాలని మహిళా లోకం ఆకాంక్షిస్తోంది.

ఇదీ చూడండి:Tokyo Olympics: ప్రారంభ వేడుకకు వేళాయెరా..

Last Updated : Jul 23, 2021, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details