Olympic Games Beijing 2022: వింటర్ ఒలింపిక్స్‌కు వేళైంది.. హిమ శిఖరాల్లో పతకాల వేటకు సమయం ఆసన్నమైంది. ఈ క్రీడలు ప్రారంభమయ్యేది శుక్రవారమే. 90 దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, పక్షం రోజులకు పైగా సాగే సమరంలో పోటీపడబోతున్నారు. 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరగబోతున్నాయి. ఈ ఆటల కోసం బీజింగ్, యన్‌కింగ్, జాంగ్‌జియా నగరాల్లోని 13 వేదికలు ముస్తాబయ్యాయి. ప్రఖ్యాత బీజింగ్ జాతీయ స్టేడియం (బర్డ్‌నెస్ట్)లో శుక్రవారం ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే కర్లింగ్, లూజ్, స్కై జంపింగ్, అల్పైన్ స్కీయింగ్, ఫ్రీస్టయిల్ స్కీయింగ్, ఐస్ హాకీ, స్కై జంపింగ్ విభాగాల్లో పోటీలు మొదలుకాగా.. శనివారం పతకాల ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఈసారి వింటర్ ఒలింపిక్స్‌లో విదేశీ వీక్షకులకు ప్రవేశం లేదు. అంతేకాదు అథ్లెట్లు, అధికారుల కోసం ప్రత్యేకమైన క్లోజ్డ్ లూప్ సిస్టమ్ (బబుల్)ను ఏర్పాటు చేశారు. క్రీడా గ్రామంలో ఉండే వారికి ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. బీజింగ్‌లో ఒలింపిక్స్ జరగబోతుండడం గత 14 ఏళ్లలో ఇది రెండోసారి. 2008లో ఇక్కడే వేసవి ఒలింపిక్స్ జరిగాయి. ఈసారి క్రీడల్లో ఫ్రీ స్టయిల్ స్కీయింగ్ (మిక్స్‌డ్ జెండర్ టీమ్ ఏరియల్స్), ఫ్రీస్టయిల్ స్కీయింగ్ (పురుషుల బ్యాగ్ ఎయిర్), ఫ్రీస్టయిల్ స్కీయింగ్ (మహిళల బిగ్ ఎయిర్), షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ (మిక్స్‌డ్ టీమ్ రిలే), స్కై జంపింగ్ (మిక్స్‌డ్ టీమ్), స్నో బోర్డింగ్ (మిక్స్‌డ్ టీమ్ స్నో బోర్డ్ క్రాస్) విభాగాలు కొత్తగా చోటు దక్కించుకున్నాయి.
భారత్ నుంచి ఆరిఫ్:ఈసారి వింటర్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఒక అథ్లెటే అర్హత సాధించాడు. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్ స్కీయింగ్‌లో పోటీపడబోతున్నాడు. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ విభాగాల్లో అతడు బరిలో దిగనున్నాడు. 2002 తర్వాత ఒక్కరే పాల్గొనడం ఇదే తొలిసారి. 1964 నుంచి వింటర్ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత్.. ఇప్పటిదాకా ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది. శివ కేశవన్ (లూజ్) అత్యధికంగా ఆరుసార్లు ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. చివరిగా జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌లోనూ శివ కేశవన్ పాల్గొన్నాడు.