టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు భారతీయ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా. శుక్రవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మరో మూడేళ్లలో జరగబోయే పారిస్ ఒలింపిక్స్ 2024కి శిక్షణనంతా డాకర్.క్లాస్ బార్టోనియెట్జ్ ఆధ్వర్యంలోనే ఉంటుందని స్పష్టం చేశాడు. అందుకు గల ప్రత్యేక కారణాలను ఇలా వివరించాడు.
"టోక్యో ఒలింపిక్స్‌కు నాకు క్లాస్ బార్టోనియెట్జ్ కోచ్‌గా వ్యవహరించారు. ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయనిచ్చే శిక్షణా పద్ధతులు నాకు సూట్ అవుతాయి. అందుకే రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు ఆయనే నా కోచ్‌గా కొనసాగుతారు. ఇక మా కోచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే.. సీరియస్ సెషన్స్‌లో కూడా ఆయన జోక్స్ వేస్తుంటారు. నాకు కూడా ట్రైనింగ్ సమయంలో సీరియస్‌గా ఉండటం నచ్చదు. సాధారణంగా శిక్షణా సమయంలో కొంత మంది కోచ్‌లు బెత్తం పట్టుకొని కూర్చుంటారు (నవ్వుతూ), కానీ నా గురు అలా కాదు."