టెన్నిస్ అభిమానులకు శుభవార్త.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడనున్న జకోవిచ్ - novak djokovic grand slam wins
వ్యాక్సిన్ వేయించుకోలేదనే నిబంధనల కారణంతో గత ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆడలేకపోయిన టెన్నిస్ స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్.. వచ్చే ఏడాది రంగంలోకి దిగనున్నాడు. వీసా సమస్య పరిష్కారం కావడం వల్ల ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది.
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్
By
Published : Nov 15, 2022, 7:24 PM IST
కరోనా వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్ల గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ వచ్చేఏడాది రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది వీసా సమస్య వల్ల ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడలేకపోయిన జకోవిచ్‌కు ఈసారి మాత్రం ఆ సమస్య తప్పిపోయింది. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం లేకపోయినా వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
"సాధారణ వీసా ప్రాసెస్ జరుగుతుంది. ఎవరైనా వెళ్లొచ్చు. సరైన సమయంలో ప్రతి ఒక్కరూ రాకపోకలు సాగించొచ్చు. అలాగే ప్రత్యేకంగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ విమాన టికెట్లను బుక్ చేసుకొని రావొచ్చు. అలానే నొవాక్‌కూ అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుంది. నొవాక్ ఇక్కడికి వచ్చి పోటీల్లో పాల్గొనాలని బలంగా కోరుకుంటున్నాడు. అతడికి ఆస్ట్రేలియా అంటే చాలా ఇష్టం. ఇక్కడే ఎక్కువగా విజయవంతమైన విషయం తెలిసిందే" అని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి ఆండ్రూ గిల్స్ తెలిపారు.
అప్పట్లో జరిగిందిదీ.. 21 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకొని మంచి ఊపు మీదున్న జకోవిచ్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే ప్లేయర్లు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని నిర్వాహకులు నిబంధన విధించారు. కొవిడ్ సోకిందనే కారణంతో జకోవిచ్ మినహాయింపు కోరాడు. అందుకు టోర్నీ నిర్వాహకులు, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించింది. దీంతో టోర్నీ కోసం మెల్‌బోర్న్ చేరుకున్న జకోను ఎయిర్‌పోర్ట్‌లో సరిహద్దు భద్రతా దళం అడ్డుకుంది. మినహాయింపు కోరేందుకు అతడు చెప్పిన కారణం సహేతుకంగా లేదని వీసా రద్దు చేసి ఇమిగ్రేషన్ నియంత్రణలోని హోటల్‌కు తరలించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన జకోకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అతని వీసా పునరుద్ధరించడంతో పాటు ఆ హోటల్ నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటి ఇమిగ్రేషన్ మంత్రి అలెక్స్ మాత్రం తన వ్యక్తిగత అధికారాన్ని ఉపయోగించి మరోసారి జకోవిచ్ వీసాను రద్దు చేశారు. దీనిపైనే కోర్టుకు వెళ్లగా అక్కడా జకోవిచ్‌కు చుక్కెదురైంది. దీంతో ఆస్ట్రేలియా నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.