Australian Open Novak Djokovic: సెర్బియా ఆటగాడు, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడంపై ఆటగాళ్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన స్పెయిన్ ఆటగాడు రఫేల్ నాదల్.. 'ఆటగాళ్ల కన్నా ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణే చాలా ముఖ్యమైనది. జకోవిచ్ ఆడినా, ఆడకపోయినా ఆస్ట్రేలియన్ ఓపెన్ గొప్పగా సాగుతుంది. జకోవిచ్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించనప్పటికీ.. ఒక వ్యక్తిగా, గొప్ప టెన్నిస్ క్రీడాకారుడిగా అతడిని ఎప్పుడూ గౌరవిస్తాను. దాదాపు రెండు వారాలుగా సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికి.. ఆటపై దృష్టి పెట్టాల్సి ఉంది' అని నాదల్ అన్నాడు.
కాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ నవోమి ఒసాకా కూడా ఈ వివాదంపై స్పందించింది. జకోవిచ్ లాంటి దిగ్గజ ఆటగాడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనకుండా నిషేధం విధించడం దురదృష్టకరమని పేర్కొంది. 'జకోవిచ్ సొంత నిబంధనల ప్రకారం ఆడాలనుకుంటున్నాడు. గత రెండు వారాలుగా ఎక్కడ చూసినా అతడికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. చాలా మంది టెన్నిస్‌ను పక్కన పెట్టి జకోవిచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. అందుకే, నేను టెన్నిస్ గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను' అని గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్ విమర్శించాడు.