షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్ హామీ ఇచ్చారు. జపాన్లో కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో విశ్వ క్రీడల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోటీలను నిర్వహించేందుకు నిబద్ధతతో ఉన్నట్లు బాక్ గురువారం తెలిపారు.
"టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా జులై 23న ప్రారంభమవుతాయి. అనుమానమే లేదు. అందుకే ప్లాన్ బీ సిద్ధం చేయలేదు. పోటీలను భద్రంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం."
-థామస్ బాక్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు
ఇటీవల ఒలింపిక్స్ నిర్వహణపై కచ్చితంగా చెప్పాలేమన్న ఐఓసీ సభ్యుడు డిక్ పౌండ్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వేసవిలోనే క్రీడలు జరగుతాయని చెప్పారు.
జపాన్లో కరోనా కట్టిడికి అత్యయిక స్థితిని విధించారు. ఈ నేపథ్యంలో పోటీల నిర్వహణపై అనుమానాలు వక్యమవుతూ వస్తున్నాయి. ఒలింపిక్స్ నిర్వహణ కష్టతరమని, రద్దు చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఓ జపాన్ పత్రిక పేర్కొంది. అయితే టోర్నీ నిర్వహణపై సానుకూలంగా ఉన్న ప్రధాని యొషిహిదే సుగా సహకారంతో ముందుకే వెళ్తామని స్థానిక నిర్వహణ కమిటీ శుక్రవారం స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది జరగాల్సిన విశ్వక్రీడలు వాయిదాపడ్డాయి. టోక్యోలో 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారా ఒలింపిక్స్ జరగనున్నాయి.
ఇదీ చూడండి:'కరోనాపై విజయానికి చిహ్నంగా ఒలింపిక్స్ నిర్వహణ'