ఒలింపిక్స్ వచ్చినపుడల్లా అథ్లెటిక్స్‌లో పతకం ఏమైనా వస్తుందా? అని ఆశగా చూడడం.. చివరకు ఎలాంటి ఫలితం దక్కకపోవడం వల్ల నిరాశ చెందడం భారత అభిమానులకు అలవాటుగా మారింది. పరుగులో తొలి పతకాన్ని అందుకునేది ఎవరని? జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్‌పుట్‌లో తమ సామర్థ్యంతో మెప్పించేది ఎవరని? లాంగ్ జంప్‌లో లక్ష్యాన్ని ముద్దాడేది ఎవరని? సుదూర గమ్యాల దిశగా సాగే నడకలో విజేతగా నిలిచేది ఎవరని? ఇన్నాళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. భారత అథ్లెటిక్స్‌లో అద్భుత ప్రదర్శన చూపే అథ్లెట్ల మెడలో వాలేందుకు అటు ఒలింపిక్ పతకాలూ సిద్ధంగా ఉన్నాయి. మరి టోక్యో ఒలింపిక్స్‌లోనైనా ఇన్నేళ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కుతుందేమో చూడాలి. ఈ సారి 26 మంది భారత అథ్లెట్ల బృందం విశ్వ క్రీడల్లో తలపడేందుకు సిద్ధమైంది. అందులో 16 మంది వ్యక్తిగత విభాగాల్లో పోటీపడుతుండగా.. పురుషుల 4×400మీ, మిక్స్‌డ్ 4×400మీ. రిలేల కోసం మరో పది మంది అథ్లెట్లు టోక్యో విమానం ఎక్కనున్నారు. వీళ్లలో జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాపై భారీ అంచనాలున్నాయి. అతను కచ్చితంగా పతకంతో తిరిగి వస్తాడని అందరూ నమ్ముతున్నారు.
వీళ్లూ ఉన్నారు..
కరోనా కారణంగా ప్రాక్టీస్‌కు ఇబ్బంది తలెత్తినప్పటికీ పట్టుదలతో శ్రమించి ఒలింపిక్స్ బెర్తులు దక్కించుకున్న భారత ఇతర ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు కూడా ఈ విశ్వ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. జావెలిన్ త్రోలో నీరజ్‌తో పాటు శివ్‌పాల్ సింగ్ కూడా చూడదగ్గ అథ్లెటే. వరుసగా రెండో సారి ఒలింపిక్స్ బరిలో దిగనున్న అగ్రశ్రేణి స్ప్రింటర్ ద్యుతి చంద్ మహిళల వ్యక్తిగత 100మీ, 200మీ. పరుగులో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్‌గా పేరున్న ఆమె.. ఒలింపిక్స్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.
ఇక పురుషుల 20 కిలోమీటర్ల నడకలో కేటీ ఇర్ఫాన్, సందీప్ కుమార్, రాహుల్ ఆశలు రేకెత్తిస్తున్నారు. ఇటీవల సరికొత్త జాతీయ రికార్డుతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తజిందర్ పాల్ (షాట్ పుట్) కూడా సవాలుకు సిద్ధమయ్యాడు. మహిళల్లో అన్ను రాణి (జావెలిన్ త్రో), సీమా పునియా (డిస్కస్ త్రో) పోడియంపై నిలబడే దిశగా ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
ఇదీ చదవండి:Tokyo Olympics: ప్రారంభోత్సవానికి అమెరికా ప్రథమ మహిళ
అంచనాలు అందుకునేనా?
18 ఏళ్ల వయసులో.. 2016 ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఆ మీట్‌లో దేశానికి తొలి పసిడి అందించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అండర్-20 విభాగంలో 86.48 మీటర్ల దూరం ఈటెను విసిరి ప్రపంచ జూనియర్ రికార్డుతో సంచలనం సృష్టించాడు. అదే ఏడాది రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన అథ్లెట్ కంటే నీరజ్ ప్రదర్శనే అత్యుత్తమం కావడం విశేషం. అప్పుడే భారత అథ్లెటిక్స్‌లో మరో స్టార్ అథ్లెట్ తయారవుతున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ ఛాంపియన్‌షిప్‌ల్లో నిలకడైన ప్రదర్శనతో పతకాలు కొల్లగొట్టాడు. 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు ఖాతాలో వేసుకుని తనపై అంచనాలను అమాంతం పెంచేశాడు. 2019లో మోచేతి గాయానికి శస్త్రచికిత్స కారణంగా కొన్నాళ్ల పాటు ఆటకు దూరమైన అతను.. దాని నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో సత్తాచాటుతున్నాడు. నిరుడు దక్షిణాఫ్రికాలోని ఓ లీగ్‌లో 87.86 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ ఏడాది 88.07 మీటర్ల దూరంతో తన పేరు మీదనే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టిన అతను.. ఈ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.
మరోవైపు గాయాల కారణంగా డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ థామస్ (జర్మనీ), 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత విజేత మాగ్నస్ (ఈస్తోనియా) టోక్యో క్రీడల నుంచి తప్పుకోవడం కూడా నీరజ్ పతక అవకాశాలను మెరుగుపర్చేదే. అయితే ఆ దిశగా అతనికి గట్టిపోటీ ఎదురు కానుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న అతనికి.. తొలి మూడు స్థానాల్లో ఉన్న వెటర్ (జర్మనీ), మార్సిన్ (పోలెండ్), వాల్కోట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) నుంచి ముప్పు పొంచి ఉంది. తనపై ఉన్న అంచనాల తాలూకు ఒత్తిడిని అధిగమించి, నిలకడగా మంచి ప్రదర్శన చేయగలిగితే అతనికి పతకం దక్కే వీలుంది. ప్రస్తుతం స్వీడన్‌లో సాధన కొనసాగిస్తున్న ఈ 23 ఏళ్ల అథ్లెట్.. టోక్యోకు నేరుగా అక్కడి నుంచే వెళ్లనున్నాడు.
కొద్ది తేడాతో..
బ్రిటీష్ పాలనలో కలకత్తాలో పుట్టిన నార్మన్ ప్రిచర్డ్ 1900 ఒలింపిక్స్‌లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించి అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు గెలిచాడు. పురుషుల 200మీ, 200మీ. హార్డిల్స్‌లో అతను రజతాలు సొంతం చేసుకున్నాడు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రం భారత్‌కు అథ్లెటిక్స్‌లో ఇప్పటివరకూ ఒక్క ఒలింపిక్ పతకం కూడా రాలేదు. 1960 ఒలింపిక్స్ పురుషుల 400మీ.పరుగులో మిల్కా సింగ్, 1984 ఒలింపిక్స్ మహిళల 400మీ. హార్డిల్స్‌లో పీటీ ఉష సెకనులో వందో వంతు తేడాతో కాంస్య పతకం గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు.
టోక్యోకు వెళ్లే భారత అథ్లెటిక్స్ బృందం
అవినాశ్ (3000మీ.స్టీపుల్‌ఛేజ్), ఎంపీ జబీర్ (400మీ.హార్డిల్స్), శ్రీశంకర్ (లాంగ్‌జంప్), తజిందర్ పాల్ (షాట్‌పుట్), నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్, అన్ను రాణి (జావెలిన్ త్రో), కేటీ ఇర్ఫాన్, సందీప్ కుమార్, రాహుల్, భావ్న జాట్, ప్రియాంక (20 కి.మీ.నడక), గుర్‌ప్రీత్ సింగ్ (50 కి.మీ.నడక), ద్యుతి చంద్ (100మీ, 200మీ.పరుగు), కమల్‌ప్రీత్ కౌర్, సీమా పునియా (డిస్కస్ త్రో), జాకబ్, రాజీవ్, అనాస్, నాగనాథన్, నిర్మల్ టామ్ (పురుషుల 4×400మీ.రిలే), సార్థక్, అలెక్స్, రేవతి, శుభ వెంకటేశన్, ధనలక్ష్మీ (మిక్స్‌డ్ 4×400మీ.రిలే).
ఇదీ చదవండి:Tokyo Olympics: 'దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రదర్శన చేస్తాం'