తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మేరీనే తీసుకోవాలనుకుంటే నేనెందుకు ఆడడం' - zareen letter

తనకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పంది తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్​. ఒలింపిక్స్ ట్రయల్స్ కోసం మేరీకోమ్​ను నేరుగా పంపాలనుకుంటున్న బీఎఫ్​ఐ తీరును తప్పుపట్టింది. తనకు న్యాయం చేయాలని కేంద్రమంత్రి కిరణ్​ రిజిజుకు లేఖ రాసింది.

నిఖత్ జరీన్

By

Published : Oct 18, 2019, 8:14 AM IST

ఒలింపిక్స్ ట్రయల్స్​ కోసం సెలక్షన్ నిర్వహించకుండా మేరీకోమ్​ను నేరుగా పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్​ఐ) తీరును తప్పుపట్టింది హైదరాబాద్​ బాక్సర్ నిఖత్ జరీన్. తనకు న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రి కిరణ్​రీజిజుకు లేఖ రాసింది. రష్యా ప్రపంచ ఛాంపియన్​షిప్​లోనూ సెలక్షన్ నిర్వహిస్తారని చెప్పి.. మేరీని టోర్నీకి పంపించారని తెలిపింది.

"సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా ప్రతిసారి మేరీ కోమ్‌ను టోర్నీలకు పంపిస్తుంటే నేనెందుకు బాక్సింగ్‌ చేయాలి? ప్రదర్శన.. సామర్థ్యం ప్రకారం భారత మహిళల బాక్సింగ్‌లో నా స్థానమేంటో చెప్పండి. నిజాయతీగా నాకో అవకాశం ఇవ్వండి. మేరీ కోమ్‌తో తలపడేందుకు ఒక్క ఛాన్స్‌ అడుగుతున్నా. ట్రయల్స్‌లో గెలుపైనా.. ఓటమైనా నేను అంగీకరిస్తా. రాత్రికి రాత్రే బీఎఫ్‌ఐ నిబంధనలు మార్చడం సరికాదు" - నిఖత్ జరీన్​, హైదరాబాద్ బాక్సర్​.

విశ్వక్రీడల్లో 23 స్వర్ణాలు సాధించిన మైకెల్​ ఫెల్ఫ్స్​ అయినా సెలక్షన్ ద్వారే ఒలిపింక్స్​కు అర్హత సాధించాలని స్పష్టం చేసింది నిఖత్.

"మేరీ కోమ్‌ కోసం సెలెక్షన్స్‌ అవసరం లేకుండా నిబంధనను మార్చి ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ప్రతిసారీ తమను తాము నిజాయతీగా నిరూపించుకోవాలన్నది క్రీడల్లో ప్రాథమిక సూత్రం. మేరీ కోమ్‌ నా స్ఫూర్తిప్రదాత. ఆమె లాంటి దిగ్గజం సెలెక్షన్స్‌కు ముఖం చాటేయాల్సిన అవసరం లేదు. 23 స్వర్ణాలు సాధించిన ఫెల్ఫ్స్‌ సైతం సెలక్షన్స్‌ ద్వారానే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలి" -నిఖత్ జరీన్​, హైదరాబాద్​ బాక్సర్.

పురుషుల బాక్సింగ్​లో ఇండియా ఓపెన్​లో శివథాపపై మనీష్ కౌశిక్ గెలిచాడని, అయినా ప్రపంచ ఛాంపియన్​షిప్​ కోసం సెలక్షన్ నిర్వహించగా ఇద్దరిలో మళ్లీ మనీషే పైచేయి సాధించాడని చెప్పింది. మరీ ఇప్పుడు తనపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నించింది.

ఇటీవల రష్యాలోని ఉలాన్‌ ఉదెలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ కాంస్య పతకం సాధించింది. గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో మేరీ 6 స్వర్ణాలు, ఒక రజతం గెలిచింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌ కోసం మేరీ 48 కేజీల నుంచి 51 కేజీలకు మారింది. ఈ పరిణామం నిఖత్‌కు శాపంగా తయారైంది. మొదట్నుంచీ 51 కేజీలలో బరిలో దిగుతున్న నిఖత్‌కు మేరీ అడ్డుగా మారింది. దిగ్గజ క్రీడాకారిణి కావడంతో బీఎఫ్‌ఐ పెద్దలు సైతం మేరీకే అండగా నిలుస్తుండటంతో నిఖత్‌కు అన్యాయం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details