ప్రో కబడ్డీ కోసం ఆటగాళ్ల వేలం ముగిసింది. 12 జట్లు 200 మంది ఆటగాళ్లతో కొత్త సీజన్ సిద్ధమవుతోంది. పీకేఎల్ ఏడో సీజన్ జులై 1 నుంచి అక్టోబర్ 9 వరకు జరగనుంది.
జులై 1 నుంచే ప్రో కబడ్డీ నయా సీజన్ - యు ముంబా
ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ కోసం 2 రోజుల పాటు నిర్వహించిన వేలం ముగిసింది. ఆటగాళ్లను దక్కించుకోవడానికి ప్రాంఛైజీలు కోట్లు గుమ్మరించాయి. మంగళవారం ముగిసిన వేలంలో 12 జట్లు కలిసి ఆటగాళ్ల కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టాయి.
జూలై 1 నుంచే ప్రొ కబడ్డీ నయా సీజన్
ఈ నయా సీజన్ కోసం జరిగిన వేలంలో.. ఆల్‌రౌండర్ సందీప్ నర్వాల్‌ను రూ.89 లక్షలకు 'యు ముంబా' దక్కించుకుంది. తొలి రోజు వేలంలో సిద్ధార్థ్ దేశాయ్ కోసం భారీ మొత్తం వెచ్చించింది తెలుగు టైటాన్స్. ఈ ఆటగాడి కోసం సుమారు రూ. 1.45 కోట్ల ధర చెల్లించింది.
- నితిన్ తోమర్‌ను రూ.1.20 కోట్లకు పుణెరి పల్టాన్ దక్కించుకుంది. డిఫెండర్ నీరజ్ కుమార్ కోసం పట్నా పైరేట్స్ రూ.44.75 లక్షలు ఖర్చుపెట్టింది. వికాస్ కాలే కోసం హరియాణా స్టీలర్స్ రూ.34.25 లక్షలు చెల్లించింది. తెలుగు టైటాన్స్ అమిత్ కుమార్, అరుణ్‌లను చెరో రూ.10 లక్షలకు దక్కించుకుంది.
- ఆంధ్రప్రదేశ్ ఆటగాడు మూల శివ గణేశ్ రెడ్డిని రూ.6 లక్షలకు టైటాన్స్ సొంతం చేసుకుంది.
- ఆరు సీజన్ల పాటు తెలుగు టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరీని రూ.94 లక్షలకు తమిళ్ తలైవాస్ కైవసం చేసుకుంది. మోను గోయత్ రూ.93 లక్షలకు యూపీ యోధాస్ తీసుకుంది.
- విదేశీ ఆటగాళ్లలో మహ్మద్ ఇస్మాయిల్(ఇరాన్)ను బెంగాల్ వారియర్స్ రూ.77.75 లక్షలకు దక్కించుకుంది. 2 రోజుల పాటు జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఒక్కో ఫ్రాంచైజీ రూ.4.4 కోట్లు ఖర్చు చేసింది.
కేటగిరీ-బి ఆటగాళ్ల కోసం జరిగిన వేలంలో డిఫెండర్ మహిందర్ సింగ్‌ను రూ.80 లక్షలకు బెంగళూరు బుల్స్ కైవసం చేసుకుంది. మరోవైపు రైడర్ మన్‌జీత్ సింగ్‌ను పుణెరి పల్టాన్ జట్టు రూ.63 లక్షలకు దక్కించుకుంది.