Neeraj Chopra Won Gold Medal : చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు పతకాల పర్షం కురిపిస్తున్నారు. పురుషుల జావెలిన్ త్రోలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా స్వర్ణాన్ని ముద్దాడాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ కిశోర్ కుమార్ జెనా రజతం నెగ్గాడు. పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల దూరం బల్లాన్ని విసిరి పసిడిని పట్టేశాడు. ఇదే విభాగంలో నీరజ్‌కు గట్టిపోటీ ఇచ్చిన కిశోర్ జెనా కెరీర్ బెస్ట్ నమోదు చేస్తూ రజత పతకం కైవసం చేసుకున్నాడు. 86.77 మీటర్ల దూరం బల్లెం విసిరిన కిశోర్ చివరి వరకూ నీరజ్‌కు గట్టిపోటీనిచ్చాడు.
రిలేలో స్వర్ణం, రజతం..
మరోవైపు పురుషుల 4×400 మీటర్ల రిలే ఫైనల్‌లో భారత్ స్వర్ణ పతకం నెగ్గింది. 3 నిమిషాల 1.58 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో మహిళల 4×400 మీటర్ల రిలే ఫైనల్‌లో 3 నిమిషాల 27.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని రజతం పతకంతో రెండో స్థానంలో నిలిచింది భారత్.
రెండు పతకాలతో ముకుంద్ సాబలే..
అలాగే పురుషుల 5000 మీటర్ల ఫైనల్‌లో మరో స్టార్ అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సాబలే రజతం పతకం దక్కించుకున్నాడు. అతడు 18 నిమిషాల 21.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, ఈ క్రీడల్లో అవినాశ్‌కిది రెండో మెడల్. ఇంతకుముందు 3000 మీటర్ల పరుగు పందెంలో అతడు పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు.