Neeraj Chopra Wins Gold World Athletics Championships 2023 : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరాజ్ చోప్రా (Neeraj Chopra World Athletics) మరో రికార్డు సృష్టించాడు. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన నీరజ్ ఈ సారి ఇదేమెగాటోర్నీ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్ చరిత్ర సృష్టించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే జోరును ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించి సత్తా చాటాడు.
Neeraj Chopra Gold Medal Throw Distance : క్వాలిఫయర్స్‌లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల దూరం బల్లెం విసిరి డైరెక్ట్‌గా ఫైనల్‌కు అర్హత సాధించాడు నీరజ్. అయితే ఈ తుది పోరు తొలి ప్రయత్నంలో అతడు విఫలమయ్యాడు. దీంతో అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ అతడు రెండో ప్రయత్నంలో పుంజుకున్నాడు. బల్లెంను 88.17 మీటర్లు విసిరాడు. ఇక ఈ ప్రదర్శనతో అతడు 12 వ స్థానం నుంచి అగ్ర స్థానానికి దూసుకొచ్చాడు. ఆ తర్వాత ప్రయత్నాల్లోనూ 86.32, 84.64, 87.73, 83.98 మీటర్ల దూరం బల్లెం విసిరి అగ్రస్థానాన్ని కొనసాగించాడు. భారత అభిమానుల్లో పసిడి కాంతులను నింపాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇక నీరజ్‌తో పాటు ఈ తుది పోరులో పోటీపడ్డ భారత అథ్లెట్స్ కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో ఆరోస్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్‌ను ముద్దాడగా.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల విసిరి కాంస్యం అందుకున్నాడు.