Neeraj Chopra ODI World Cup 2023 :వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. అందులో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఉన్నారు. వీరందరూ అభిమానులతో పాటు స్టాండ్స్‌లో కూర్చుని టీమ్ఇండియాకు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో గ్యాలరీలోఉన్న సినీ స్టార్స్‌ను కెమెరాలు ఫోకస్ చేశాయి. కానీ, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాను మాత్రం ఒక్కసారి కూడా స్క్రీన్‌పై చూపించలేదు. అసలు ఈ ఫైనల్ చూసేందుకు అతడు వచ్చినట్లు నీరజ్ షేర్ చేసిన ఫొటోల ద్వారానే అభిమానులకు తెలిసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పట్లోనే ఈ విషయంపై విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ విమర్శలపై నీరజ్ చోప్రా స్పందించాడు.
"కెమెరాలు నావైపు ఉన్నాయా? లేవా? అనే ఆలోచనే నాకు రాలేదు. కాకపోతే నాదొక చిన్న విజ్ఞప్తి. నేను పోటీపడేటప్పుడు నన్ను చూపిస్తే చాలు. డైమండ్ లీగ్‌ను సరిగ్గా టెలికాస్ట్ చేయడం లేదు. కొన్నిసార్లు కేవలం హైలైట్స్‌ను మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. డైమండ్ లీగ్‌తో పాటు ఇతర పోటీలను ప్రసారం చేయడం ముఖ్యమైన అంశం. అంతేకానీ, ఎక్కడికెళ్లినా.. కెమెరాలన్నీ నావైపు ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. అహ్మదాబాద్ మ్యాచ్‌కు నేను వచ్చింది కేవలం గేమ్‌ను ఆస్వాదించడానికే కానీ కెమెరాల్లో నేను కనిపించాలని కాదు. భారత్ గెలిచి ఉంటే ఇంకా సంతోషపడేవాడిని. ఫైనల్‌ను స్టాండ్స్‌లో నుంచి చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది " అని చోప్రా తన అభిప్రయాన్ని వ్యక్తం చేశాడు.