టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డా(Neeraj Chopra News).. సంపాదనలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చేరువ కానున్నాడు. ప్రకటనల కోసం అతడు తీసుకునే పారితోషికం(Neeraj Chopra brand endorsement) అమాంతం వెయ్యి శాతం పెరగడమే ఇందుకు కారణం.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్డా(Neeraj Chopra Olympics) పేరు దేశమంతటా మారుమోగింది. ఈ క్రమంలో అతడికి పాపులారిటీ విపరీతంగా పెరిగింది. 2020 ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ చోప్డా.. ప్రకటనల కోసం తీసుకునే పారితోషికం ఏడాదికి 15-25 లక్షల మధ్య ఉండేది. అయితే.. ఒలింపిక్స్‌లో 87.58 రికార్డు త్రోతో స్వర్ణం సాధించిన తర్వాత అతడి ప్రకటనల పారితోషికం 10 రెట్లు పెరగడం ఆశ్చర్యకరమైన విషయమని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత ఈవెంట్ల తర్వాత ఏ ఆటగాడి పారితోషికం ఇంతలా పెరగలేదని అంటున్నారు.
టాప్‌లో కోహ్లీ..
ప్రస్తుతం దేశంలోని క్రీడాకారులందరిలో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రమే 1-5 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్నాడు. నీరజ్ కూడా ఈ జాబితాలో చేరడం గమనార్హం. కానీ, కోహ్లీతో పోల్చితే.. నీరజ్ సంపాదన కాస్త తక్కువగానే ఉంటుందని నిపుణులు తెలిపారు. మరోవైపు.. రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఆర్జించే క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను కూడా నీరజ్ అధిగమించడం విశేషం.