అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించి ప్రజల 100 ఏళ్ల కలను సాకారం చేశాడు నీరజ్ చోప్డా. ఇటీవల కాలంలో ఆయన్ను ఇంటర్వ్యూల పేరుతో ఇబ్బందికర ప్రశ్నలు అడగటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఇటీవల ఒక ఆర్జే ఇంటర్వ్యూకు పిలిచి ఆన్‌లైన్‌లో హగ్ అడిగింది.. తాజాగా చరిత్రకారుడు రాజీవ్ సేథీ కూడా నీరజ్‌ను ఓ వివాదాస్పద ప్రశ్న అడిగారు. దీంతో నెటిజన్లు ఆయన తీరును తప్పుపడుతున్నారు.
ఇటీవల ఒక ఆంగ్ల మీడియా సంస్థ నీరజ్ చోప్డాను ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఆయన వ్యక్తిగత , క్రీడా జీవితానికి సంబంధించిన పలు ప్రశ్నలు పలువురు అడిగారు. ఈ క్రమంలో ఆర్ట్ హిస్టారియన్ రాజీవ్ సేథీ లైన్‌లోకి వచ్చారు. "అందమైన కుర్రాడివి.. నీ సెక్స్ జీవితాన్ని.. అథ్లెటిక్స్ ట్రైనింగ్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకొంటున్నావు..?" అని ప్రశ్నించారు. పైగా అదొక ఇబ్బందికరమైన ప్రశ్నే అయినా.. అథ్లెటిక్స్‌కు అది సీరియస్ ప్రశ్నే అని సమర్థించుకొనే ప్రయత్నం చేశారు.
దీనికి నీరజ్ చోప్డా చాలా హుందాగా స్పందిస్తూ.. "సారీ సర్" అని సమాధానం ఇచ్చారు. అయినాకానీ, రాజీవ్ సేథీ ఒక పట్టాన ఆగలేదు. మరోసారి అదే ప్రశ్నకు సమాధానం కోసం ఒత్తిడి చేశారు. ఈ సారి కూడా నీరజ్ ఏమాత్రం సహనం కోల్పోకుండా "ప్లీజ్ సర్, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయింది" అంటూ కట్ చేశారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు ట్విట్టర్లో రాజీవ్ తీరును తప్పుబట్టారు.