Neeraj chopra gold medal : అంతర్జాతీయ వేదికలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌తో చరిత్ర సృష్టించిన అతడు.. ఆ తర్వాత డైమండ్ లీగ్ ఫైనల్లోనూ విజేతగా నిలిచాడు. ఇప్పుడు మరో అద్భుత విజయం సాధించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ కొత్త సీజన్‌లో తొలి అంచె టోర్నీలో అదిరే ప్రదర్శనతో టైటిల్‌ను ముద్దాడాడు.
శుక్రవారం ఎనిమిది మంది మేటి జావెలిన్ త్రోయర్లు పోటీపడిన జావెలిన్ త్రో ఫైనల్లో.. నీరజ్ చోప్రా బల్లెంను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. తొలి త్రోలోనే 88.67 మీటర్ల దూరాన్ని అందుకుని అగ్రస్థానం సాధించిన అతడు.. ఈ సీజన్లో బెస్ట్ త్రో వేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో అతడు వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు కూడా అర్హత సాధించడం విశేషం. కాగా, జావెలిన్ ఈవెంట్‌లో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత ప్రమాణం 85.50 మీటర్లుగా ఉంది. నీరజ్ ఆ దూరాన్ని తొలి ప్రయత్నంలోనే నమోదు చేసి అర్హత సాధించాడు.
లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు.. ఇక తాజాగా జరిగిన ఫైనల్లో రెండు, మూడు త్రోలలో 86.04 మీ, 85.47 మీటర్లు దూరం ఈటెను విసిరాడు నీరజ్. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన భారత స్టార్.. 5, 6 ప్రయత్నాల్లో 84.37 మీ, 86.52 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్‌ను ఖాయం చేసుకున్నాడు. అయితే టైటిల్‌ను సాధించినప్పటికీ నీరజ్.. తాను అనుకున్న 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు. చోప్రాకు గట్టిపోటీ ఇచ్చిన టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ వాద్లిచ్ ఉత్తమంగా 88.63 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 85.88 మీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గతంలో డైమండ్ లీగ్ 2017లో 84.67 మీటర్లతో ఏడో స్థానం.. 2018లో దోహా వేదికపై 87.43 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నాలుగో స్థానం దక్కించుకున్నాడు నీరజ్.
ఇక ఇదే మీట్లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో పోటీపడ్డాడు భారత అథ్లెట్ ఎల్డోజ్ పాల్. అతడు 15.84 మీటర్ల దూరం దూకి పదో స్థానంలో నిలిచాడు. ఈ ట్రిపుల్ జంప్‌లో పెడ్రో పిచార్డ్ (పోర్చుగల్) గోల్డ్ మెడల్, జాంగో (బుర్కినఫాసో) సిల్వర్ మెడల్, యాండీ డియాజ్ (క్యూబా) బ్రాండ్ మెడల్ సాధించారు. కాగా, డైమండ్ లీగ్‌లో మొత్తం 14 సిరీస్‌లు జరుగుతాయి. సెప్టెంబర్‌లో గ్రాండ్ ఫైనల్ జరగనుంది.
ఇదీ చూడండి:IPL 2023 : చితక్కొట్టిన వృద్ధిమాన్, పాండ్య.. గుజరాత్ ఘన విజయం