First Indian Won Diamond League : ఒక అథ్లెట్ ప్రపంచ స్థాయిలో స్థిరంగా రాణించాలంటే ఎంత నైపుణ్యం ఉండాలి.. ఎంత విశ్వాసముండాలి.. మరెంత ఫిట్‌గా ఉండాలి! ఈ మూడింటిని కలబోసి వచ్చాడు నీరజ్. కేవలం 13 నెలల వ్యవధిలోనే ఒలింపిక్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, డైమండ్ లీగ్‌లో ట్రోఫీ సాధించడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా తాజాగా జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్లో అతడి ప్రదర్శన ఏకపక్షంగా సాగింది. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసినా ఒత్తిడికి లోనవకుండా రెండో త్రోలో 88.44 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి మిగిలిన అందరిని వెనక్కి నెట్టేశాడు నీరజ్.
ఆ తర్వాత వరుసగా 88.00, 86.11, 87.00, 83.60 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి టైటిల్ ఎగరేసుకుపోయాడు. అతడి తర్వాత రెండో స్థానం సాధించిన జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్) అత్యుత్తమ త్రో 86.94 మీటర్లు. ఈ గెలుపుతో వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ బెర్తును కూడా నీరజ్ సొంతం చేసుకున్నాడు. 90 మీటర్ల పైన జావెలిన్‌ను విసిరే సత్తా ఉన్న వాద్లిచ్ లాంటి స్టార్ ఆటగాడిని టోక్యో ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకు నీరజ్ అయిదుసార్లు వెనక్కినెట్టడం విశేషం.
లక్ష్యం 2023: ఫిట్‌నెస్ సమస్యలు ఎదురైనా గోడకు కొట్టిన బంతిలా తిరిగి మరింత మెరుగ్గా రాణిస్తున్నాడు నీరజ్. అమెరికాలో జరిగిన యూజీన్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో అతడికి గజ్జల్లో గాయమైంది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. లుసానె డైమండ్ లీగ్ లెగ్‌లో తొలి ప్రయత్నంలోనే 89.08 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
ఇక వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటడంపైనే నీరజ్ దృష్టి పెట్టాడు. ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగబోతున్న చోప్రా.. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 90 మీటర్ల మార్క్ అందుకోవడం కూడా అతడి తదుపరి ధ్యేయం. ఈ జూన్‌లో స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ అంచెలో 89.94 మీటర్ల దూరం విసిరి కొద్దిలో 90 మీటర్ల మార్క్‌ను అందుకోలేకపోయిన చోప్రా మున్ముందు ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు.
90 మీటర్ల మార్క్.. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: నీరజ్ చోప్రా
స్విట్జర్లాండ్‌లోని డైమండ్ లీగ్ ఫైనల్స్‌ను గెలిచిన తొలి భారతీయ జావెలిన్ త్రో ఆటగాడిగా టోక్యో ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డైమండ్ లీగ్‌లో 88.44 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. దీంతో మరోసారి '90 మీటర్లు' చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇవే కామెంట్లు.. నీరజ్ జావెలిన్‌ను ఎప్పుడు 90 మీటర్లు విసురుతావు?.. ఇంకా సాధించలేదని ఏమైనా ఒత్తిడిగా ఫీలవుతున్నావా..? ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నావు? అని ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో నీరజ్ చోప్రా వారికి సమాధానం ఇచ్చాడు.