కరోనా కారణంగా ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల వేడుక వర్చువల్‌గా జరిగింది. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని అవార్డులు అందజేశారు. అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్నతో పాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల్ని క్రీడాకారులు అందుకున్నారు.
మొత్తం ఈ ఏడాది అవార్డుల కోసం 74 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. ఇందులో 14 మంది అథ్లెట్లు వివిధ కారణాలతో వేడుకకు హాజరుకాలేకపోయారు. మిగిలిన 60 మంది ఈరోజు అవార్డుల్ని అందుకున్నారు.
ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఈ వేడుకను రాష్ట్రపతి భవన్లో నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల జరిగిన వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమానికి జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కార్యాలయాలు వేదికయ్యాయి. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చండీగఢ్, బెంగళూరు, పుణె, సోనెపట్, హైదరాబాద్, భోపాల్‌లోని సాయ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రపతి భవన్ నుంచి రామ్‌నాథ్ కోవింద్ లైవ్‌లో పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న క్రీడాకారులు పెరిగిన నగదు బహుమతి
క్రీడల, సాహస పురస్కారాాల నగదు బహుమతిని పెంచింది క్రీడామంత్రిత్వ శాఖ. అర్జున అవార్డుకు 15లక్షలు, ఖేల్‌రత్నకు 25 లక్షలు అందజేయనున్నారు. ఇంతకుముందు ఈ నగదు విలువ వరుసగా 5, 7.5 లక్షలుగా ఉండేది. క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు.