భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐహెచ్ఎఫ్) చీఫ్ హోదాకు నరేందర్ బత్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రెండు సమాఖ్యలకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా ఎంపికైన బత్రా.. కోర్డు ఆదేశాలతో ఇటీవల ఈ పదవి నుంచి తప్పుకున్నారు.
హాకీ ఇండియా నిధులు రూ.35 లక్షల దుర్వినియోగం చేసినట్టు బాత్రాపై అభియోగాలున్నాయి. దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యే వరకు బాత్రా.. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఖన్నా ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారని కూడా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు.