యూఎస్ ఓపెన్ ఆడుతున్న టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గాయపడ్డాడు. అయితే.. ఇదేదో ప్రత్యర్థి ఆటగాడు కొట్టిన బంతి తాకడం వల్లనో.. లేకపోతే కండరాలు పట్టేయడంతోనో జరగలేదు. తనకు తానే గాయం చేసుకున్నాడు. షాట్ కొట్టే సందర్భంలో తన రాకెట్ ముక్కుకు బలంగా తాకడంతో బాధతో విలవిల్లాడిపోయాడు. ముక్కు నుంచి రక్తం కూడా వచ్చింది. యూఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగ్నినితో రఫేల్ తలపడిన సమయంలో చోటు చేసుకుంది. దీంతో మెడికల్ బ్రేక్ సమయంలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని మరీ బరిలోకి దిగాడు.
దూకుడుగానే..
ఫోగ్నినితో తొలి సెట్‌ను 2-6తో ఓడిన రఫేల్ నాదల్.. ఆ తర్వాత మాత్రం చెలరేగాడు. వరుసగా రెండు సెట్ల (6-4, 6-2)ను కైవసం చేసుకుని ఫోగ్నినిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇదే క్రమంలో నాలుగో సెట్లోనూ దూకుడుగానే ఆడాడు. అయితే షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా.. రాకెట్ వేగంగా అతడి ముక్కును తాకింది. దీంతో రాకెట్‌ను పక్కన పడేసి నేలపై పడుకొనిపోయాడు. ఈ క్రమంలో ముక్కు నుంచి కాస్త రక్తం రావడంతో.. వెంటనే ప్రాథమిక వైద్యం చేశారు. ఓ వైపు నొప్పి ఇబ్బంది పెట్టినా నాలుగో సెట్‌లోనూ 6-1 తేడాతో ఫోగ్నిని చిత్తు చేశాడు. దీంతో ఫోగ్నినిపై 2-6, 6-4, 6-2, 6-1 తేడాతో నాదల్ విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.