Achanta Sharath Kamal CWG 2022 : ఇటీవల జరిగిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో మూడు గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ సాధించాడు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్. 40 సంవత్సరాల వయసులోనూ ఆటల్లో దూసుకుపోతున్నాడు. తన వయసు గురించి ఆలోచించకుండా ఆటపై దృష్టిపెట్టాడు. తాను సాధించిన మైలురాళ్లు ఇతరులకు స్ఫూర్తినిస్తాయంటున్నాడీ ఆటగాడు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో తాను చేసిన ప్రదర్శన, ఇలాంటి అద్భుత ప్రదర్శనలు చేయడానికి తనలో స్ఫూర్తి నింపిన వాటి గురించి, ఇలాంటి వయసులో అథ్లెట్లు ఎదుర్కొనే సమస్యల గురించి ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో ఆచంట శరత్ కమల్ పంచుకున్నాడు.
ప్రశ్న: టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత, పారిస్ ఒలింపిక్స్‌లో ఎప్పుడు కనిపిస్తారు అని అడిగినప్పుడు మీరు సమాధానమివ్వలేదు. ఇటీవలి మీ ఇంటర్య్వూలను బట్టి మీరు పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు అనిపిస్తోంది. అప్పడు ఎలా ఉంది, ఈ మధ్య కాలంలో ఏం మారింది?
జవాబు: నేను రెండు సంవత్సరాలు విరామం తీసుకోవాలనుకున్నాను. తర్వాత ఆట గురించి ఆలోచించడానికి మరో రెండు సంవత్సరాలు సమయం కావాలనుకున్నాను. టోక్యో ఒలింపిక్స్ తర్వాత, పారిస్ ఒలింపిక్స్‌కు మూడేళ్ల సమయం ఉన్నా.. ఆడతానని అనుకోలేదు. అప్పుడు నా మెయిన్ టార్గెట్ కామన్వెల్త్ గేమ్స్, 2022 ఆసియా గేమ్స్. కానీ, ఆసియా గేమ్స్ షెడ్యూల్ 2023కు వెళ్లిపోయింది. దాంతో నేను పూర్తిగా బర్మింగ్‌హామ్ గేమ్స్ పైనే దృష్టి పెట్టాను. అందులో నా కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాను. నేను ఇప్పుడు పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. ఇంకా రెండు సంవత్సరాలు కూడా సమయం లేని పారిస్ ఒలింపిక్స్‌లో తలపడడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రశ్న: మీరు మూడు గోల్డ్ మెడల్స్ సాధించడం అద్భుతం. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కామన్వెల్త్ గేమ్స్ కారణంగా మెబైల్స్, టీవీల ద్వారా ప్రేక్షకుల నుంచి మీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని మీరు అనుకుంటున్నారా?
జవాబు: నేను 2006లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. కామన్వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్ విభాగంలో అదే మొదటి గోల్డ్ మెడల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విషయాల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు స్పోర్ట్స్ చాలా టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి. టీవీల్లో చూసే ప్రేక్షకుల సంఖ్యా పెరిగింది. అలా చాలా మంది నన్ను చూస్తున్నారు. అదే నన్ను విదేశీ గడ్డపై మ్యాచ్‌లు గెలిసేలా చేసింది. ఈ గేమ్ పాపులర్ అవడానికి కూడా అదే కారణం. అప్పటి కంటే ఇప్పుడు నన్ను ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు. నా మ్యాచ్‌లు చూసి, నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు.