తెలంగాణ

telangana

ETV Bharat / sports

Hockey: తల్లి కూరగాయల విక్రేత.. 'గోల్స్​' వేటలో తనయ - తల్లి కూరగాయలు

Mumtaz khan Indian hockey player: పొట్ట కూటి కోసం తల్లి కూరగాయలు అమ్ముతుంటే.. ఆమె కుమార్తె జూనియర్​ మహిళల హాకీ ప్రపంచకప్​లో దేశాన్ని గెలిపించేందుకు గోల్స్​ వేటలో దూసుకెళ్తోంది. ఆమెనే ఉత్తర్​ప్రదేశ్​, లఖ్​నవూకు చెందిన కైజర్​ జహాన్​ కుమార్తె ముంతాజ్​. ఆమె గురించే ఈ కథనం...

Mumtaz khan hockey player
తల్లి కూరగాయలు తనయ గోల్స్‌

By

Published : Apr 10, 2022, 6:51 AM IST

Updated : Nov 28, 2022, 11:54 AM IST

Mumtaz khan Indian hockey player: అది లఖ్‌నవూలోని తాప్కానా బజార్‌.. వేసవి ఎండను సైతం లెక్క చేయకుండా ఓ మహిళ అక్కడ కూరగాయలు అమ్ముతోంది. మరోవైపు దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో విశ్వవిద్యాలయ మైదానంలో హాకీ మ్యాచ్‌ జరుగుతోంది. ఓ అమ్మాయి గోల్‌తో జట్టు ఖాతా తెరిచి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ రెండు విషయాల మధ్య సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? పొట్ట కూటి కోసం ఇక్కడ తల్లి కైజర్‌ జహాన్‌ కూరగాయలు అమ్ముతుంటే.. జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌లో దేశాన్ని గెలిపించేందుకు ఆమె తనయ ముంతాజ్‌ అక్కడ గోల్స్‌ వేటలో దూసుకెళ్తోంది.

పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన ముంతాజ్‌ అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే ఆరు గోల్స్‌తో జట్టు ఈ టోర్నీ చరిత్రలో రెండోసారి సెమీస్‌ చేరడంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీలో ఇప్పటివరకూ అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారిణుల జాబితాలో ఆమె మూడో స్థానంలో ఉంది. 19 ఏళ్ల ముంతాజ్‌ చిన్నప్పటి నుంచే క్రీడల్లో చురుకు. 2013లో తన పాఠశాల అథ్లెటిక్స్‌ బృందంతో కలిసి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లింది. అక్కడ పరుగులో సత్తాచాటిన ఆమె ప్రతిభను గమనించిన ఓ స్థానిక కోచ్‌ హాకీ ఆడమని ప్రోత్సహించాడు. అప్పటి నుంచి హాకీ స్టిక్‌పై ప్రేమ పెంచుకున్న ఆమె తన సహజ నైపుణ్యాలతో అద్భుతాలు చేయడం మొదలెట్టింది. 13 ఏళ్ల వయసులోనే సీనియర్‌ క్రీడాకారిణులతో ఆడి గొప్ప ప్రదర్శనతో క్రీడా హాస్టల్‌లో ప్రవేశం పొందింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగింది. 2017లో జాతీయ జూనియర్‌ జట్టులో చోటు దక్కించుకుంది. ఆ తర్వాతి ఏడాది యూత్‌ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులో ఆమె సభ్యురాలు. ఇప్పుడు ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. ముంతాజ్‌ సహా ఆరుగురు ఆడపిల్లలున్న కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నా కోచ్‌ల అండతో ఇంత దూరం వచ్చింది.

ఇదీ చూడండి:ప్రతి 10 బంతులకో సిక్సర్​తో పాండ్య@4.. మరి టాప్​ ఎవరు?

Last Updated : Nov 28, 2022, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details