Mirabai Chanu Asian Championships 2024 :ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ వేదికగా 2024 ఫిబ్రవరీలో జరగనున్న ఆసియా ఛాంపియన్షిప్స్కు స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ దూరం కానున్నారు. అక్టోబర్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో గాయపడిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పూర్తిగా ఫిట్ కాలేదని అందుకే ఈ టోర్నీకి దూరం కానున్నట్లు ఆమె తెలిపారు. అయితే ప్రపంచకప్ సమయానికల్లా ఆమె మునపటిలా మారి పోటీల్లో పాల్గొంటానని వెల్లడించారు.
మరోవైపు పారిస్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ రూల్స్ ప్రకారం రానున్న ఒలంపిక్స్‌లో పాల్గొనాలంటే ఓ లిఫ్టర్ తప్పనిసరిగా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2024 ప్రపంచ కప్‌లో పాల్గొనవలసి ఉంటుంది. అంతే కాకుండా 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్, 2023, 2024 కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్, 2023 గ్రాండ్ ప్రిక్స్ I, 2023 గ్రాండ్ ప్రిక్స్ IIలోనూ తమ సత్తా చాటాల్సి ఉంటుంది. అయితే ఆసియా ఛాంపియన్‌షిప్‌లను మిస్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ తన అప్‌కమింగ్ ఈవెంట్స్‌పై పడదని విశ్లేషకుల మాట. దీనికి కారణం ఆమె ప్రస్తుత ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ (OQR)లో రెండో స్థానంలో ఉన్నారు. ఇక తాజా జాబిత గ్రాండ్ ప్రిక్స్ II ముగిసిన తర్వాత వెలువరనుంది.
ప్రస్తుతం చాను పాటియాలాలోని ఓ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన తదుపరి మ్యాచ్‌ల కోసం శిక్షణ తీసుకునేందుకు యూఎస్‌కు పయనవ్వనున్నారు. అందులో భాగంగా ఆమె ట్రైనింగ్ కోచ్ డాక్టర్ ఆరోన్ హోర్షిగ్ను కలవనున్నారు. ఈయన ఓ మాజీ వెయిట్‌లిఫ్టర్. ప్రస్తుతం ఫిజికల్ థెరపిస్ట్‌గా పని చేస్తున్నారు. ఈయన దగ్గర చికిత్స తీసుకంటూ మెలకువలు నేర్చుకోవాలని చానూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.