సాకర్ స్టార్ లియెనల్ మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని భారీగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతడు కూడా ఈ ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన మెస్సీ 4 గోల్స్ నేరుగా చేయగా.. మరో రెండు గోల్స్ చేయడానికి సహకారం అందించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. నేడు క్రొయేషియాతో జరగనున్న మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. 2014లో అర్జెంటీనా ఫైనల్స్‌కు చేరినా.. ప్రపంచకప్ అందుకోలేదు. మెస్సీకి ఇది లోటుగా నిలిచింది. ఇప్పుడు మెస్సీకి దాదాపు 35 ఏళ్ల వయసు. దీంతో మరో ప్రపంచకప్ ఆడే సమయానికి అతడికి 40ఏళ్లు వచ్చేస్తాయి. ఫిట్‌నెస్ ప్రాధాన్యంగా సాగే సాకర్‌లో అప్పటి వరకు ఆడటం ఓ సవాలే.
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నికి ముందు కూడా ఓ సందర్భంలో మెస్సీ మాట్లాడుతూ ఇదే చివరి ప్రపంచకప్ కావొచ్చేమో అని వ్యాఖ్యానించాడు. తాజాగా కోచ్ లియోనల్ స్కాలనీ దీనిపై స్పందించాడు. "ప్రస్తుతం మెస్సీఆటతీరును ఎంజాయ్ చేస్తున్నాను. అతడు ఆటను కొనసాగిస్తాడో లేదో చూద్దాం. అతడు కొనసాగడం మాకు (అర్జెంటీనా జట్టుకు), ఫుట్‌బాల్ ప్రపంచానికి గొప్పవిషయం" అని పేర్కొన్నాడు.