జర్మనీ గ్రాండ్‌ప్రిలో మరో సంచలన విజయం నమోదైంది. 21 ఏళ్ల డచ్ రేసర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. రేస్‌ను గంట 44 నిముషాల 31.275 సెకన్లలో పూర్తిచేశాడీ యువ డ్రైవర్. ఫలితంగా ఈ ఏడాది రెండో విజయం ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్లో ఇది ఏడో విజయం. నాలుగుసార్లు ఫార్ములావన్ ఛాంపియన్, ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానానికే పరిమితమయ్యాడు.
హామిల్టన్ నిరాశ...
వర్షం కారణంగా ట్రాక్ సరిగా అనుకూలించక స్టార్ రేసర్లు ఒకరినొకరు ఢీకొట్టుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ హామిల్టన్ అయితే కెరీర్లో చెత్త ప్రదర్శన మూటగట్టుకున్నాడు. కెరీర్ 200వ రేసులో బరిలోకి దిగిన మెర్సిడెస్ స్టార్ హామిల్టన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ స్టార్ డ్రైవర్ కారు ప్రమాదానికి గురవడం వల్ల ఆటను గంట 44 నిముషాల 50.942 సెకన్లలో పూర్తిచేశాడు. ఆలస్యంగా రేస్ పూర్తిచేయడం వల్ల ఒక్క పాయింట్ కూడా లభించలేదు. చివరిగా ఆడిన 23 రేసుల్లో ఈ మెర్సిడెస్ డ్రైవర్ ఒక్క పాయింట్ అయినా గెలవలేకపోవడం ఇదే తొలిసారి.
నాలుగు సార్లు ఛాంపియన్ వెటెల్... గంట 44నిముషాల 38.608 సెకన్ల టైమింగ్‌తో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. టోరో రోసో డ్రైవర్ డానిల్ క్వియాట్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ట్రాక్‌పై పలువురి కార్లు ఢీకొనడం వల్ల కొందరు స్టార్ డ్రైవర్లు అసలు రేసునే పూర్తి చేయలేకపోయారు. బొటాస్ (మెర్సిడెస్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ), రికియార్డో (రెనౌ)లు రేసు నుంచి వైదొలిగారు. ఆగస్టు 4న హంగేరి గ్రాండ్‌ప్రి ప్రారంభం కానుంది.