Max Verstappen wins Abu Dhabi Grand Prix: అది 2008.. సీజన్‌లో చివరిదైన బ్రెజిలియన్ గ్రాండ్ ప్రి రేసు. 23 ఏళ్ల హామిల్టన్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను దక్కించుకోవాలంటే ఆ రేసులో ఐదో స్థానంలో నిలిస్తే సరిపోతుంది. కానీ రేసు ఆరంభం నుంచే అతను వెనకబడి ఉండడం వల్ల టైటిల్ దక్కడం కష్టమేననిపించింది. కానీ అనూహ్యంగా చివరి ల్యాప్‌లో ఐదో స్థానానికి దూసుకొచ్చి అతను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 13 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇలాగే ఇప్పుడు వెర్‌స్టాపెన్ మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్ టైటిల్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో చివరిదైన రేస్‌లో.. తీవ్ర ఒత్తిడి మధ్యలో.. ఆఖరి ల్యాప్‌లో హామిల్టన్‌ను దాటి లక్ష్యాన్ని చేరుకున్నాడు. 24 ఏళ్ల ఈ డ్రైవర్ రక్తంలోనే రేసింగ్ ఉంది. అతని తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు రేసర్లే.
నాలుగేళ్ల ప్రాయంలోనే..
మ్యాక్స్ వెర్‌స్టాపెన్‌కు నాలుగేళ్ల వయసులోనే రేసింగ్‌తో ప్రేమ కుదిరింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అతను బాల్యంలోనే కార్టింగ్ చేయడం మొదలెట్టాడు. అతని తండ్రి జోస్ వెర్‌స్టాపెన్ మాజీ ఎఫ్1 రేసర్. అతని తల్లి సోఫీ ఒకప్పటి కార్టింగ్ రేసర్. తన అమ్మానాన్నల నుంచి రేసింగ్‌ను వారసత్వంగా పొందిన మ్యాక్స్ ట్రాక్‌పై కారును పరుగులు పెట్టించడంలో పట్టు సాధించాడు. ఒక్కసారి రేసు మొదలైందంటే అతని నరాలు వేగాన్ని నింపుకుంటాయి. స్టీరింగ్ మంత్ర దండంలా మారిపోతుంది. లక్ష్యమొక్కటే అతని మదిలో మెదులుతుంది. పోడియంపై నిలబడాలనే తపనే అతని కళ్లలో కాంతులు నింపుతుంది. అంతే ఇక అతని కారు ఆగదు. ప్రత్యర్థులను వెనక్కి నెట్టి రయ్‌మని దూసుకెళ్తుంది. తన తల్లి దేశమైన బెల్జియంలో పుట్టిన వెర్‌స్టాపెన్.. తన తండ్రి పుట్టిన నెదర్లాండ్స్ తరపున ఎఫ్1లో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అతి పిన్న వయసులో..
బాల్యం నుంచే కారును పరుగులు పెట్టించిన వెర్‌స్టాపెన్ ఎఫ్1 ప్రపంచ ఛాంపియన్ కావాలనే కలను ఇప్పుడు నెరవేర్చుకున్నాడు. ఆ దిశగా అతని ప్రయాణం వేగంగా సాగింది. టీనేజీలోనే సంచలన ప్రదర్శనతో మొదట్లో అంతర్జాతీయ కార్టింగ్‌లో మెరిసిన అతను.. ఆ తర్వాత ఫార్ములావన్‌లో అడుగుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో స్కుడెరియా టోరో రోసో జట్టు తరపున 2015లో ఎఫ్1 అరంగేట్రం చేసి ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్సు రేసర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండేళ్ల పాటు అదే జట్టుతో కొనసాగాడు. కానీ అతనికి అన్ని రేసుల్లో పాల్గొనే అవకాశం రాలేదు.
అదే మలుపు
Max Verstappen World Champion: 2016లో రెడ్ బుల్‌తో చేరిన తర్వాత వెర్‌స్టాపెన్ దశ తిరిగింది. పూర్తి స్థాయి రేసర్‌గా మారాడు. ఆ ఏడాది స్పానిష్ గ్రాండ్ ప్రి గెలిచి.. తక్కువ వయసులో (18 ఏళ్ల 228 రోజులు)నే ఓ ఎఫ్1 రేసు నెగ్గిన డ్రైవర్‌గా రికార్డు నమోదు చేశాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగాడు. తన వేగానికి దూకుడు జత చేస్తూ ఫలితాలు రాబట్టాడు. ముఖ్యంగా రెండేళ్లలో అతని ప్రదర్శన ఎంతో మెరుగైంది. వరుసగా రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను మూడో స్థానంతో ముగించాడు. ఈ సీజన్‌లో మాత్రం అతని ప్రదర్శన అంతకుమించి అని చెప్పుకోవాలి. హామిల్టన్‌కు షాకిస్తూ అతను అనూహ్య విజయాలు సాధించాడు. ఈ సీజన్‌లో రెండో రేసు అయిన ఎమిలీయా రోమాగ్న గ్రాండ్ ప్రిలో విజయంతో ఖాతా తెరిచిన అతను.. ఆ తర్వాత మొనాకో, ఫ్రాన్స్, స్టిరియా, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్, యుఎస్, మెక్సికో, అబుదాబి రేసుల్లో గెలిచాడు. అతను ముందే ప్రపంచ ఛాంపియన్ అవుతాడని అనిపించింది. కానీ హామిల్టన్ గత మూడు రేసులు నెగ్గి పోటీలోకి వచ్చాడు. దీంతో ఛాంపియన్‌గా నిలిచేందుకు చివరి రేసులో గెలవడం అనివార్యమైంది. ఆఖరి రేసులో అంచనాలను మించి రాణించి తొలి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. హామిల్టన్ రిటైర్మెంట్ దశకు రావడం వల్ల.. ఇక భవిష్యత్‌లో వెర్‌స్టాపెన్ ఆధిపత్యం చెలాయించేలా కనిపిస్తున్నాడు.