ఆరేళ్ల ముందు సంగతి. విశ్వనాథన్ ఆనంద్ అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్. ఆరోసారి టైటిల్ కోసం బరిలోకి దిగాడీ దిగ్గజ క్రీడాకారుడు. ఆనంద్ అనుభవమంత లేదు ప్రత్యర్థి వయసు! అతను ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడుతోంది తొలిసారి. మ్యాచ్‌లో ఆ కుర్రాడిని ఎదుర్కోవడానికి ఆనంద్ తంటాలు పడుతుంటే.. డ్రా చేసుకోవడమే గగనం అన్నట్లుగా ఆడుతుంటే.. అభిమానులకు చాలా కష్టంగా అనిపించింది! చివరికి ఆనంద్ టైటిల్ కోల్పోతుంటే.. ఆనంద్ అభిమానుల అహం దెబ్బ తింది. తర్వాతి ఏడాది మళ్లీ ఆనంద్.. అదే ప్రత్యర్థికి తలవంచితే తల కొట్టేసినట్లయింది!
కానీ తర్వాత అంతర్జాతీయ చెస్‌లో ఆ కుర్రాడి ఆధిపత్యం.. అప్రతిహత విజయాలు చూశాక.. అప్పటి ఆనంద్ ఓటములు ఎంతమాత్రం అవమానకరం కాదని, అతను ఓడింది ప్రపంచ చెస్ చరిత్రలోనే ఒక మహా మేధావి చేతుల్లో అని అందరికీ అర్థమైంది! ఆ మహా మేధావి పేరు.. మాగ్నస్ కార్ల్‌సన్! ప్రస్తుతం క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్.. ఈ మూడు రకాల చెస్‌లోనూ ఇతగాడే ప్రపంచ ఛాంపియన్!
మొన్న మన కోనేరు హంపి ర్యాపిడ్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్ అయింది. నిర్ణీత 12 రౌండ్లు ముగిసేసరికి మరో ఇద్దరితో కలిసి ఆమె సమాన పాయింట్లు సాధించింది. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా, హంపి లీ టింగ్‌జీ టైటిల్ పోరులో తలపడ్డారు. టైబ్రేక్‌లో కూడా సమమైతే విజేతను తేల్చడానికి ఆర్మగెడాన్ గేమ్ నిర్వహించాల్సి వచ్చింది. మరి పురుషుల విభాగం పరిస్థితేంటా అని చూస్తే.. సగం రౌండ్లు అయ్యేసరికే ఛాంపియన్ ఎవరో తేలిపోయింది. అందరి అంచనాలకు తగ్గట్లే మాగ్నస్ కార్ల్‌సన్ ఆధిపత్యం చలాయించాడు. అన్ని రౌండ్లూ అయ్యేసరికి ద్వితీయ స్థానంలో ఉన్న క్రీడాకారుడి కంటే అతను ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత బ్లిట్జ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తే.. కాస్త పోటీ ఎదురైంది కానీ.. అతడికి ఎవ్వరూ చెక్ పెట్టలేకపోయారు. అర పాయింట్ తేడాతో అతను టైటిల్ ఎగరేసుకుపోయాడు. ర్యాపిడ్‌లో కార్ల్‌సన్ ప్రపంచ ఛాంపియన్ కావడమిది మూడోసారి కాగా.. బ్లిట్జ్‌లో ఏకంగా అయిదోసారి టైటిల్ సాధించాడు.
ఇక చెస్‌లో అత్యున్నతమైన క్లాసికల్ విభాగంలో అతను నాలుగుసార్లు ఛాంపియన్. 2013లో 22 ఏళ్ల వయసులోనే దిగ్గజ క్రీడాకారుడు ఆనంద్‌ను ఓడించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన అతను.. తర్వాతి నాలుగేళ్లలో మరో మూడు టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. మూడు విభాగాల్లో కలిపి 12 ప్రపంచ టైటిళ్లతో తనకు తానే సాటి అనిపిస్తున్నాడు. అంతకంతకూ కార్ల్‌సన్ జోరు పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ప్రత్యర్థులు బలహీన పడుతుంటే.. అతనేమో మరింత బలం పుంజుకుంటున్నాడు. కార్ల్‌సన్ ఏదైనా టోర్నీలో టైటిల్ గెలవకపోతే షాకవుతున్నారు తప్ప.. అతడి ఏ విజయమూ ఆశ్చర్యానికి గురి చేయడం లేదు.
ఒకే సమయంలో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిడ్జ్ మూడు విభాగాల్లోనూ ఛాంపియన్‌గా నిలవడం అతడికే చెల్లింది. బాబీ ఫిషర్, అనతోలి కార్పోవ్, గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్.. ఇలా ఎందరో మేధావుల్ని చూసింది చెస్ ప్రపంచం. ఆయా సమయాల్లో వాళ్లను మించిన చెస్ ఛాంపియన్లు లేరనిపించి ఉంటుంది అభిమానులకు. కానీ కార్ల్‌సన్ వాళ్లందరినీ మించిన వాడని అతడి విజయాలు, గణాంకాలు చాటి చెబుతాయి. ఏ ఛాంపియన్‌తో పోల్చినా.. అతడి ఆట ప్రత్యేకం.. అతడి వ్యూహాలు రహస్యం.. అతడి వ్యక్తిత్వం అనూహ్యం! తొమ్మిదేళ్లకే జాతీయ ఛాంపియన్.. 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్.. 19 ఏళ్లకే ప్రపంచ నంబర్‌వన్.. 22 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్.. చరిత్రలో ఏ క్రీడాకారుడూ అందుకోని ఎలో రేటింగ్.. 12 ప్రపంచ టైటిళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కార్ల్‌సన్ ఘనతలెన్నో!