Magnus Carlsen World Championship: ప్రత్యర్థి మారాడు. వేదిక మారింది. కానీ విజేత మాత్రం మారలేదు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. మరోసారి టైటిల్ ఎగరేసుకుపోయాడు 31 ఏళ్ల నార్వే యోధుడు మాగ్నస్ కార్ల్‌సన్. ఇప్పటికే 2013, 2014 సంవత్సరాల్లో విశ్వనాథన్ ఆనంద్‌ను, 2016లో కర్జాకిన్‌ను, 2018లో కరువానాను ఓడించి టైటిల్ అందుకున్న మాగ్నస్.. తాజా ఛాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాషిపై 7.5-3.5 పాయింట్లతో విజయం సాధించాడు. శుక్రవారం 11వ గేమ్‌లో కార్ల్‌సన్ గెలవడం వల్ల టైటిల్ అతడి సొంతమైంది. ఈ గేమ్‌లో నల్లపావులతో ఆడిన కార్ల్‌సన్.. 49 ఎత్తుల్లో ఇయాన్ కథ ముగించాడు. ఈ విజయంతో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్‌ను సమం చేశాడు కార్ల్‌సన్.
"ఈసారి ఛాంపియన్‌షిప్ ఆరంభంలో చాలా కఠినంగా అనిపించింది. ఒత్తిడికి గురయ్యాను. మెదడులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. కానీ తర్వాత అంతా తేలికైపోయింది. అన్నీ కలిసొచ్చాయి. పూర్తిగా నా ఆధిపత్యం సాగింది" అని మ్యాచ్ అనంతరం కార్ల్‌సన్ తెలిపాడు.
Magnus Carlsen vs Ian Nepomniachtchi: గేమ్ ఆరంభంలో పెద్ద తప్పు చేసిన నెపోమ్‌నియాషి.. ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేకపోయాడు. తొలి ఐదు గేమ్‌లు డ్రా అయ్యాక.. ఆరో గేమ్‌లో తొలి విజయాన్నందుకున్న కార్ల్‌సన్, తర్వాత 8, 9 గేమ్‌లనూ గెలుచుకున్నాడు. 7, 10 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. 11వ గేమ్‌ను గెలిచినా, డ్రాగా ముగించినా.. నెపోమ్‌నియాషి టైటిల్ రేసులో ఉండేవాడు. కానీ కార్ల్‌సన్ ఈ గేమ్‌లో గెలిచి అతడి కథ ముగించాడు. 14 గేమ్‌ల ఛాంపియన్‌షిప్‌లో మిగతా మూడు గేమ్‌ల్లోనూ ఇయాన్ నెగ్గినా కార్ల్‌సన్ కంటే వెనుకబడే ఉంటాడు. కాబట్టే ఇక్కడితో ఛాంపియన్‌షిప్ ముగిసిపోయింది.
2014లో ఆనంద్, 2016లో కర్జాకిన్ మాత్రమే కార్ల్‌సన్‌పై ఒక్కో గేమ్ గెలవగలిగారు. మిగతా ఛాంపియన్‌షిప్‌లన్నింట్లో ప్రత్యర్థులకు కార్ల్‌సన్ ఒక్క అవకాశమూ ఇవ్వలేదు. అయితే 2016లో కర్జాకిన్, 2018లో కరువానా.. కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిస్తూ నిర్ణీత గేమ్‌ల్లో పాయింట్లు సమం చేసి మ్యాచ్‌ను టైబ్రేక్‌కు మళ్లించగలిగారు. మిగతా మూడు ఛాంపియన్‌షిప్స్‌లో కార్ల్‌సన్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. ప్రస్తుత మ్యాచ్‌లో సుదీర్ఘంగా 135 ఎత్తుల పాటు సాగిన ఆరో గేమ్‌లో ఓడాక నెపోమ్‌నియాషి ఆత్మవిశ్వాసం సడలింది. ఆ తర్వాత అతను కార్ల్‌సన్ జోరు ముందు నిలవలేకపోయాడు. అతను చివరి ఆరు గేమ్‌ల్లో నాలుగు ఓడి డిఫెండింగ్ ఛాంపియన్‌కు టైటిల్ సమర్పించుకున్నాడు.
ఛాంపియన్ షిప్ పోరు సాగిందిలా