అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న వర్థమాన క్రీడాకారులు వాళ్లు.. కానీ ఇంతలోనే లాక్‌డౌన్ అంటూ కరోనా వాళ్ల జోరుకు కళ్లెం వేసింది. ఇళ్లు వదిలి బయటకు రాకుండా చేసింది. మంచి ఫామ్‌లో ఉండి.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఈ ఛాంపియన్లు ఇప్పుడు లాక్ 'డౌన్'లో ఉన్నారు. మరి భవిష్యత్తుపై వాళ్లెమంటున్నారో చూద్దామా..!
ఐరోపాలో ఉండాల్సింది..
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సమయానికి యూరోప్‌లో ఉండేవాడినని వర్థమాన టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఫిదెల్ ఆర్.స్నేహిత్ అంటున్నాడు.
పావని వరలక్ష్మీ, ఫిదెల్ ఆర్.స్నేహిత్ "మూడు టోర్నీలు, రెండు నెలల శిక్షణ కోసం ఐరోపా వెళ్లాలని నిర్ణయించుకున్నా. కానీ వైరస్ దెబ్బకు ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. మరింత దృఢంగా తయారయేందుకు ఎక్కువగా కసరత్తులు చేస్తున్నా. ఆటకు సంబంధించిన వీడియోలు చూస్తూ.. నా ఆటను ఎలా మెరుగుపర్చుకోవాలో విశ్లేషించుకుంటున్నా"
ఫిదెల్ ఆర్.స్నేహిత్, టెన్నిస్ ప్లేయర్
మరోవైపు తన ఇంట్లో ప్రత్యేకంగా షూటింగ్ రేంజ్ ఉండడం వల్ల సాధన కొనసాగిస్తున్నానట్లు టీనేజ్ షూటింగ్ సంచలనం ఇషా సింగ్ అంటోంది. "బలహీనతలపై దృష్టి పెట్టి వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నా. ప్రస్తుతానికైతే వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నా" అని పదిహేనేళ్ల ఇషా చెప్పింది.
శ్రీవల్లి రష్మిక, సంజన సిరిమళ్ల కష్టంగా ఉంది..
ఆట నుంచి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉందని ఆసియా యూత్, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం (45 కేజీలు) గెలిచిన పావని వరలక్ష్మీ తెలిపింది. "నా కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది అనుకుంటున్న సమయంలో కరోనా దెబ్బకొట్టింది. భారత శిక్షణ శిబిరానికి ఎంపికయ్యా. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సింది. కానీ వైరస్ దెబ్బకు అన్నీ తలకిందులయ్యాయి"అని పావని వెల్లడించింది.
కేకులు తయారు చేస్తున్నా..
రాకెట్ పట్టి కోర్టులో వేగంగా కదిలే టెన్నిస్ భామ శ్రీవల్లి రష్మిక.. ఇప్పుడు గరిటె పట్టుకుని వంట గదిలో ప్రయోగాలు చేస్తోంది. "ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కోసం ఇంట్లోనే కసరత్తులు చేస్తున్నా. ఇంట్లోనే ఉండడంతో వంట నేర్చుకున్నా. బిర్యానీ వండేస్తున్నా. బిస్కెట్లు, కేకులు తయారు చేస్తున్నా" అని జాతీయ జూనియర్ ఛాంపియన్ రష్మిక తెలిపింది.
వీడియోలు చూస్తున్నా..
మరోవైపు అంతర్జాలం ద్వారా కోచ్ సూచనలతో ఫిట్‌నెస్ కసరత్తులు కొనసాగిస్తున్నానట్లు చెబుతోంది యువ టెన్నిస్ తార సంజన సిరిమళ్ల. "రోజూ యోగా చేస్తున్నా. కరోనా వల్ల ఆటలు ఆగిపోవడం వల్ల ఓ ఏడాది వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తోంది" అంటూ లాక్‌డౌన్ అనుభవాలను పంచుకొంది.