అమెరికాలో ఓ పోలీస్ కిరాతక చర్యతో ప్రాణాలు వదిలిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై క్రీడా ప్రపంచం గళం విప్పుతోంది. ఇప్పటికే అమెరికా టెన్నిస్ తార కొకో గాఫ్, వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఈ ఉదంతం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వర్ణ వివక్ష ఆందోళన వ్యక్తం చేయగా.. తాజాగా వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులు స్వరం కలిపారు. అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్.. ఫ్లాయిడ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఈ విషాదాంతంలో పోలీసులు గీత దాటారన్నది స్పష్టంగా తెలుస్తోందని అతనన్నాడు.
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డారెన్ సామి స్పందిస్తూ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా క్రికెట్ ప్రపంచం గళం విప్పాల్సిన సమయం ఇదని అన్నాడు "నా సోదరుడు పాదం కింద నలిగిన వీడియో చూశాక ఓ వర్గం ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా క్రికెట్ ప్రపంచం నిలవని పక్షంలో మీరు కూడా ఈ అన్యాయంలో భాగమైనట్లే" అని సామి పేర్కొన్నాడు.