అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటోలు పోస్ట్ చేశాడు. భార్య అంటోనెలా రొకుజో, అర్జెంటీనా జెర్సీలో ఉన్న తన ముగ్గురు పిల్లల ఫొటోలను పెట్టాడు. 2022 తనకు ఎంతో ప్రత్యేకమని.. ఎప్పటికీ మర్చిపోను అని క్యాప్షన్ పెట్టాడు. "వరల్డ్ కప్ గెలవాలన్న నా కల చివరకు నిజమైంది" అంటూ మెస్సీ ఆ ఫొటోలకు క్యాప్షన్ రాశాడు.
'2022 చాలా స్పెషల్.. ఎప్పటికీ మర్చిపోను'.. ఇన్‌స్టాలో మెస్సీ పోస్ట్ వైరల్ - లియోనల్ మెస్సీ ఇన్స్టాగ్రామ్
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 2022 తనకు ఎంతో ప్రత్యేకమని.. ఎప్పటికీ మర్చిపోను అని క్యాప్షన్ పెట్టాడు.
"ప్రతి ఒక్కరికీ 2022 అద్భుతంగా గడిచి ఉంటుందని.. 2023లో అందరూ ఆరోగ్యంగా, బలంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని మెస్సీ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఫుట్‌బాల్ ఆటలో దిగ్గజ ఆటగాడిగా పేరొందిన మెస్సీ 2022కు ఘనంగా వీడ్కోలు పలికాడు. డిసెంబర్ 18న జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఫ్రాన్స్‌ను ఓడించింది.
32 ఏళ్ల తర్వాత అర్జెంటీనా మళ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 2014లో మెస్సీ నాయకత్వంలో ఆ జట్టు ఫైనల్ చేరింది. అయితే.. జర్మనీ 1-0తో గెలిచి కప్పు ఎగరేసుకుపోయింది. దాంతో నిరాశకు గురైన మెస్సీ కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఫైనల్లో అదరగొట్టాడు. ఉత్కంఠభరితంగా జరిగిన ఆ మ్యాచ్‌లో అర్జెంటీనా షూటౌట్‌లో 4-2తో గెలుపొందింది. దాంతో ఫిఫా వరల్డ్ కప్ గెలవాలన్న తన 8 ఏళ్ల కలను మెస్సీ నెరవేర్చుకున్నాడు.