ఒలింపియన్, ఆసియా గేమ్స్ పతక విజేత, దిగ్గజ ఫుట్‌బాలర్ తులసీదాస్ బలరామ్(87) గురువారం తుదిశ్వాస విడిచారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కాగా, ఈయన గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమైన ఆయన.. ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. 2021లో ఆయన ఓ సారి కింద పడిపోవడంతతో తలకు బాగా గాయం కూడా అయింది. అప్పుడు ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడా చేశారు. ఇకపోతే సిక్రింద్రాబాద్‌కు చెందిన తులసీదాస్ భారత్‌కు చెందిన దిగ్గజ ఫుట్‌బాల్ త్రయంలో ఒక్కరు. (చునీ గోస్వామి, పీకే బెనర్జీ, తులసీదాస్ బలరామ్). ఇప్పటికే చునీ గోస్వామి, పీకే బెనర్జీ కూడా చాలా కాలం క్రితమే చనిపోయారు.
కాగా ఫుట్‌బాల్ కోసం అప్పటి నిజాం నగరమైన హైదరాబాద్ నుంచి చాలా మంది కోల్‌కతాకు పయనమై ఈ క్రీడలో ప్రముఖులుగా మారారు. వారిలో తులసీదాస్ బలరామ్ అగ్రగణ్యుడు. అంతే కాకుండా 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టులో సభ్యుడు. ఆ టీమ్‌లో ఇంతకాలం జీవించి ఉన్న చివరి సభ్యుడు కూడా ఆయనే.