ప్రతిష్టాత్మక చెస్ ఒలంపియాడ్లో తొలిసారి స్వర్ణం సాధించడం.. అత్యంత సంతోషాన్నిచ్చిందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చెప్పారు. ఈ టోర్నీకి ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ, కలసికట్టుగా విజయం సాధించామన్నారు. కీలకమైన సెమీస్ టై బ్రేకర్ లో.. భారత్ ను గెలిపించి ఫైనల్ చేర్చడం.. సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ గెలుపు భారత్ లో చదరంగానికి మరింత ప్రాచుర్యం తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. ఆనంద్ లాంటి అనుభవజ్ఞులు, హరికృష్ణ, హారిక వంటి ఛాంపియన్లు, విదిత్, దివ్య వంటి జూనియర్లతో కలిసి అద్భుత గెలుపును సొంతం చేసుకున్నామన్నారు. టోర్నీకి సంబంధించిన మరిన్ని అనుభవాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.
ఎంతోమంది ప్రసిద్ధ ఆటగాళ్లు.. గ్రాండ్ మాస్టర్లు ఉన్నప్పటికీ.. చెస్ ఒలంపియాడ్ లో మన ప్రభావం చాలా తక్కువగా ఉంది. 96 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా స్వర్ణం గెలవడంపై మీ స్పందన ఏంటి..?
చెస్ ఒలంపియాడ్ ఎప్పుడూ కూడా మహిళలు, పురుషుల విభాగంలో వేర్వేరుగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా.. ఇద్దరికీ కలిపి నిర్వహించారు. ఇలా చేయడం అన్నది మనకు లాభించింది. అన్ని ఫార్మాట్లలోనూ.. టాప్ ప్లేయర్లు ఈ టీమ్ లో ఉన్నారు. తొలిదశలో మాకు ప్రధాన ప్రత్యర్థి చైనా. వారిపైన గెలిచి.. క్వార్టర్స్ కు రావడం కీలకపరిణామం. సెమీస్ వరకూ ప్రయాణం బాగానే జరిగింది. సెమీస్‌లో కీలకమైన విజయాలు సాధించాల్సిన పరిస్థితిలో ఆనంద్, నేను, హారిక, విదిత్ విజయాలు సాధించి స్కోర్ సాధించగలిగాం. సెమిస్ ట్రై బ్రేక్ కు వెళ్లింది. అలాంటి కీలక మ్యాచ్ నేను ఆడాల్సి వచ్చింది. నల్లపావులను ఎంచుకున్నాను. ఆ గేమ్ ను గెలిచి.. టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లే అవకాశం నాకు దక్కింది. ఫైనల్ లో రష్యాతో తలపడ్డాం. కొన్ని సాంకేతిక అడ్డంకుల కారణంగా ఇద్దరినీ విజేతలుగా ప్రకటించారు.
మీరు దాదాపు పాతికేళ్లుగా చెస్ ఆడుతున్నారు. వ్యక్తిగత విజయాలు చాలా సాధించారు. ఇలా ఒక టీమ్ గా గెలవడం ఎలాంటి సంతృప్తినిచ్చింది...?
ఒక బృందంగా ఏషియన్ టీం చాంఫియన్ షిప్ గెలిచాం. ప్రైవేట్, ఫ్రొఫెషనల్ టోర్నమెంట్లలో కొన్ని టీం ఈవెంట్లలో గెలిచాం. కానీ.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. ఒలంపియాడ్లో ఇలా పతకం సాధించడం మొదటిసారి. నేను ఇంతకు ముందు మూడు ఒలంపియాడ్లలో పాల్గొన్నాను. ఈ టోర్నమెంట్ మొత్తం బృంద సభ్యులు అందరూ అద్భుతంగా రాణించారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు విజయంలో కీలకపాత్ర పోషించారు.
మొదట రష్యాను విజేతగా ప్రకటించినప్పుడు .. మీకు ఎలా అనిపించింది..?
ఆ విషయం తెలిసినప్పుడు నేను ఒక గేమ్ మధ్యలో ఉన్నాను. నా స్క్రీన్ మీద మా వాళ్లు ఓడిపోయారని కనిపించింది. ఆ తర్వాతే నాకు ఏం జరిగిందో తెలిసింది. స్వర్ణం వస్తుందని మేం ఊహించలేదు. ప్లేయర్లుగా మా తప్పు లేదు కాబట్టి అప్పీల్ చేశాం. ఎలాంటి నిర్ణయం వస్తుందో మేం ఆలోచించలేదు. మేం రజతంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని నిర్ణయానికొచ్చేశాం. కానీ ఆ నిర్ణయం మాత్రం.. ప్రపంచ చెస్ సమాఖ్యదే..!
సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి భారత ఆటగాళ్లు ఇద్దరిలో ఒకరు కచ్చితంగా గెలిచే స్థానంలో.. మరొకరు మెరుగైన స్థితిలో ఉన్నారు అని చెబుతున్నారు. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణాన్ని పంచుకోవడం ఏమన్నా అసంతృప్తి కలిగించిందా..? అవి కచ్చితంగా భారత్ గెలవాల్సిన గేమ్లేనా..?
మేం దాని గురించి ఆలోచించలేదు. రష్యా కచ్చితంగా భారత్ కంటే మెరుగైన టీమ్. ఫైనల్‌కు వచ్చాక.. అవకాశాన్ని వినియోగించుకోవాలి... గట్టిపోటీ ఇవ్వాలి అని మాత్రమే అనుకున్నాం. సాంకేతిక సమస్యతో అలా జరగడం వల్ల.. దురదుష్టవశాత్తూ.. స్వర్ణాన్ని సాధించే అవకాశం కోల్పోయామని బాధపడ్డాం. చివరగా రెండు దేశాలను విజేతలుగా ప్రకటించడంపై సంతోషంగానే ఉన్నాం.
మొత్తం చెస్ ఒలంపియాడ్ లో వ్యక్తిగతంగా మీ ఆటతీరును మీరు ఎలా విశ్లేషిస్తారు?
ఆ సెమీఫైనల్లో ట్రై బ్రేక్ ఆడి ఫైనల్ కు తీసుకెళ్లడం అన్నది చాలా సంతోషం అనిపించింది. అదే సమయంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే.. ఆ సమయంలో మొత్తం జట్టంతా నా పైనే ఆధారపడి ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా.. మేం అవకాశం కోల్పోతాం. ఆ పరిస్థితిని అధిగమించి ముందుకెళ్లడం అన్నది నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది.
ప్రపంచ ఛాంపియన్ షిప్‌లలో గెలిచినా వ్యక్తిగతంగా ఎన్ని టైటిల్స్ గెలిచినా.. ఒలంపియాడ్లో గెలవడం అన్నది చాలా ముఖ్యంగా చెబుతుంటారు. ఎందుకింత ప్రాధాన్యం ఈ టోర్నీకి..!?
ఎందుకంటే దాని పేరే ఒలంపియాడ్. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మేం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో కూడా ఇదే స్థాయిలో ఆడతాం. కొన్ని ప్రైవేట్ ఛాంపియన్ షిప్‌లలో ఇంతకంటే పై స్థాయిల్లో కూడా ఆడతాం. వాటిలో గెలిచినప్పుడు ఇంత గుర్తింపు రాదు. ఒలంపియాడ్ కాబట్టే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
అంటే ఒలంపిక్స్ గోల్డ్ మెడల్‌తో సమానం అన్నమాట..!?
అంతే.. ! ఒలంపిక్స్ లో చెస్ లేదుకానీ.. ఇది దాదాపుగా అలాంటిదే. ఇందులో కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొంటాయి. అదే ఫార్మాట్లో జరుగుతుంది. కాకపోతే దీనిని ప్రపంచ చెస్ సమాఖ్య నిర్వహిస్తుంది.