చెస్ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించేందుకు భారత జట్లకు మంచి అవకాశాలు ఉన్నాయంటోంది గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి. ఒకటి నుంచి నాలుగో బోర్డు వరకు నాణ్యమైన క్రీడాకారిణులు ఉండటం అతి పెద్ద సానుకూలాంశమని భారత-ఎ జట్టుకు సారథ్యం వహిస్తున్న హంపి పేర్కొంది. మహిళల కంటే బలంగా ఉన్న పురుషుల జట్టు మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమంటున్న హంపి.. చెస్ ఒలింపియాడ్ గురించి చెప్తున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
శక్తిని కూడగట్టుకోవాలి..
సుదీర్ఘ విరామం తర్వాత క్లాసికల్ టోర్నీ ఆడబోతున్నా. చివరిసారి 2020 ఫిబ్రవరిలో అమెరికాలో ఒక టోర్నీలో గెలిచా. కరోనా కారణంగా ఏడాది పాటు క్లాసికల్ టోర్నీలే జరగలేదు. కొన్ని ప్రయాణ సమస్యల వల్ల ఐరోపా పర్యటనకు వెళ్లకపోవడంతో టోర్నీలు ఆడలేకపోయా. నిరుడు డిసెంబరులో పోలెండ్‌లో ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో బరిలో దిగా. ఆన్‌లైన్‌లో మాత్రం తరుచూ ఆడుతున్నా. గత నెలలో మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నా. ప్రతి 2, 3 నెలలకో ఈవెంట్‌లో ఆడుతున్నా. చెస్ ఒలింపియాడ్ క్లాసికల్ టోర్నీ. 11 రౌండ్లు ఉంటాయి. ఒక్కో గేమ్ 6 గంటలకు పైగా సాగుతుంది. చివరి వరకు శక్తిని కూడగట్టుకోవాలి. మన వరకు ఆడి వచ్చేయడానికి మిగతా టోర్నీలా కాదు. జట్టులోని మిగతా క్రీడాకారుల గేమ్‌ను పరిశీలించాలి. మళ్లీ కొత్త ప్రణాళికలు రచించుకోవాలి. ఎవరిని ఎక్కడ ఆడించాలి.. ఎవరిని పక్కన పెట్టాలి అన్నది ఆలోచించుకోవాలి.
పటిష్టంగా భారత్..
నా వరకు ఓపెనింగ్, మిడిల్ గేమ్‌పై ఎక్కువగా కసరత్తులు చేశా. ఈసారి ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. టాప్ బోర్డులో నేను, రెండో బోర్డులో హారిక, మూడో బోర్డులో వైశాలి, నాలుగో బోర్డులో తానియా బరిలో ఉన్నాం. భక్తి రిజర్వ్ ప్లేయర్‌గా ఉంది. ఒలింపియాడ్‌లో టాప్ సీడ్‌గా బరిలో దిగుతుండటం ఇదే ప్రథమం. రష్యా, చైనా ఉండుంటే భారత్ మూడో సీడ్‌గా ఉండేది. చైనా ఎందుకు ఆడట్లేదో తెలియదు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై ఫిడె నిషేధం విధించింది. రష్యా, చైనాలు లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప ప్రదర్శన ఇవ్వొచ్చు. టోర్నీ ఆరంభమయ్యాక ప్రదర్శనపై అంచనా వస్తుంది. 4, 5 రౌండ్ల తర్వాత గట్టి జట్లు ఎదురవుతాయని అనుకుంటున్నా. అప్పుడు ఎలా ఆడతామన్నదే ముఖ్యం.
ఎవరి గేమ్ వారిదే..
చెస్ ఒలింపియాడ్ భారత్‌లో జరుగుతుండటాన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. సొంతగడ్డపై అనుకూల పరిస్థితుల మధ్య ఆడొచ్చు. ఆహారం, వసతులు అన్నీ బాగుంటాయి. ఏది కావాలన్నా చెస్ సమాఖ్య సమకూరుస్తుంది. అదే సమయంలో అంచనాల ఒత్తిడి కూడా ఉంటుంది. మీడియా దృష్టి ఎక్కువ ఉంటుంది. వీటిని సమన్వయం చేసుకుంటూ ఆడటం ప్రతి ఒక్క క్రీడాకారిణికి అత్యంత కీలకం. చెస్‌లో ఎవరి గేమ్ వాళ్లదే. బోర్డు బయట సమన్వయం కావాలి. టీమ్ ఈవెంట్లో ఒక్కోసారి ఒత్తిడిగా లోనవుతారు. సుదీర్ఘంగా చర్చలు సాగుతాయి. ఎవరితో ఎలా ఆడాలో సుదీర్ఘంగా మాట్లాడుకుంటారు. అక్కడే శక్తి మొత్తం అయిపోతుంది. అలాంటి విషయాలపై ఎక్కువ దృష్టిసారించాల్సిన అవసరం లేదు.