Tejaswin Shankar CWG 2022 : కోర్టులో గెలిచి.. చివరి నిమిషంలో కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడే అవకాశం దక్కించుకున్న 23 ఏళ్ల తేజస్విన్ శంకర్ రికార్డు నమోదు చేశాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పురుషుల హైజంప్‌లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పోటీల్లో కాంస్యం గెలిచాడు. 2.22 మీటర్ల ఉత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ మాజీ ఛాంపియన్ డొనాల్డ్ థామస్ (బహమాస్), జోల్ క్లార్క్ ఖాన్ కూడా 2.22 మీటర్లతో శంకర్‌తో సమానంగా నిలిచారు. అయితే తక్కువ ఫౌల్స్ చేసిన భారత అథ్లెట్‌కు పతకం లభించింది. 2.25 మీటర్లు అధిగమించిన హమీష్ కెర్ (న్యూజిలాండ్) స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అంతే ఎత్తు జంప్ చేసిన బ్రాండన్ స్టార్క్ (ఆస్ట్రేలియా) రజతానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఆఖర్లో అవకాశం: 23 ఏళ్ల తేజస్విన్ శంకర్ మొదట ఈ క్రీడల్లో పాల్గొనడం అనుమానంగా మారింది. చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనలేదని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అతనిపై వేటు వేసింది. అదే సమయంలో అమెరికాలో జరిగిన ఎన్‌సీఏఏ ఛాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ప్రదర్శన చేసిన అతను కామన్వెల్త్ క్రీడల అర్హత మార్కును అందుకున్నాడు. అయినప్పటికీ మొదట ప్రకటించిన 36 మంది అథ్లెట్ల బృందంలో అతనికి చోటు దక్కలేదు. దీంతో అతను దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఆదేశాలతో అతణ్ని క్రీడలకు పంపేందుకు ఏఎఫ్‌ఐ అంగీకరించింది. కానీ ఆలస్యంగా తన పేరును పంపారనే కారణంగా కామన్వెల్త్ క్రీడల సమాఖ్య మొదట నిరాకరించింది. భారత అథ్లెటిక్స్ బృందంలోని ఇద్దరు అథ్లెట్లు డోపింగ్ కారణంగా దూరమవడంతో చివరకు శంకర్ పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.