భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో.. ఖేలో ఇండియా తొలి వింటర్ గేమ్స్ మొదలయ్యాయి. జమ్ముకశ్మీర్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడలను.. ఈనెల 11 తేదీ వరకూ నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 9వందల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈటీవీ భారత్ ఈ క్రీడలకు మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఖేలో ఇండియా వింటర్ క్రీడల్లో భాగంగా స్నో స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో షూయింగ్, స్కీ పర్వతారోహణ, ఐస్ స్టాక్, స్నో రగ్బీ, స్నో బేస్ బాల్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. గుల్మార్గ్‌లో మంచు చక్కగా కురుస్తూ ఉండడంతో వింటర్‌క్రీడల నిర్వహణకు ఇది సరైన సమయం అని జమ్ము కశ్మీర్‌క్రీడా సమాఖ్య తెలిపింది.
మంచుతో ముడిపడిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులకు ఈ పోటీలు ద్వారాలు తెరుస్తాయని భావిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మంచు పర్వతారోహణ ప్రాంతంగా పేరుగాంచిన గుల్మార్గ్‌లో పోటీలు నిర్వహించడం వల్ల అంతర్జాతీయంగా కూడా ఈ పోటీలకు గుర్తింపు వస్తుందని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.