తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇక్కడ లిక్కర్​ కంటే చదరంగానికే కిక్కు ఎక్కువ​.! - C.Unnikrishna

35 ఏళ్లుగా ఆ ఊళ్లో నిద్రలేచింది మొదలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఏనుగులూ, గుర్రాలూ తమ రాజును కాపాడుకునే పనిలో నిమగ్నమై ఉంటే.. సైనికులు రక్షణ కవచంలా నిలుస్తుంటారు. మంత్రులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వ్యూహరచనలు చేస్తుంటారు. గ్రామస్థులు మాత్రం రెప్పవేయకుండా పావులు కదుపుతుంటారు. ఆ యుద్ధభూమే 64 గళ్ల చదరంగం బోర్డు. ఆ ఊరే వందశాతం చెస్‌ ఆడే వ్యక్తులున్న ఏకైక గ్రామంగా గుర్తింపు పొందిన కేరళలోని మరోట్టిచల్‌.

Kerala's Marottichal How defeat alcohol and turns into India's 100 percent first Chess Village
ఈ ఊరిలో మద్యపానం కంటే చదరంగానికే కిక్కు ఎక్కువ​.!

By

Published : Feb 9, 2020, 11:27 AM IST

Updated : Feb 29, 2020, 5:41 PM IST

కేరళలోని త్రిశ్శూర్‌కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మరోట్టిచల్‌. అక్కడ బడీ, గుడీ, బస్టాండ్‌, ఆటోస్టాండ్‌ అన్న తేడా లేకుండా జనమంతా చెస్‌ ఆడుతూనే ఉంటారు. ఆడవాళ్లు ఒకచేత్తో వంట చేస్తూ మరో చేత్తో రాజుకు చెక్‌ పెట్టే పనిలో ఉంటారు. కిరాణా షాపులూ, హోటళ్లలోనూ 64 గళ్లు ముందుపెట్టుకుని వ్యూహరచన చేస్తూనే ఉంటారు. వృద్ధులకీ అదే కాలక్షేపం. స్కూల్లో కూడా చెస్‌కి ప్రత్యేకమైన క్లాస్‌లుంటాయక్కడ. చూస్తుంటే చదరంగం ఆ గ్రామానికి అంటిన వ్యసనం అనిపిస్తోంది కదూ! అదే విషయం గ్రామస్థుల్ని అడిగితే నిజమేనంటారు.

దుర్వ్యసనాల్ని దూరం చేసుకుని మరీ అలవాటు చేసుకున్న వ్యసనం అని చెబుతారు అక్కడి ప్రజలు. చదువుకున్నవాళ్లూ, తెలివైన వాళ్లూ మాత్రమే ఆడే ఆటగా చెప్పే చెస్‌ను... ఇక్కడ చదువుతోనూ వయసుతోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆడతారు. వందశాతం చెస్‌ ఆడేవారున్న గ్రామంగానూ గుర్తింపు పొందడానికి కారణం మాత్రం మద్యపానం, జూదమే.

చదరంగంలో నిమగ్నమైన ప్రజలు

ఇలాంటి పరిస్థితి నుంచి...

నలభై ఏళ్ల క్రితం ఆ ఊళ్లో నాటుసారా కాసేవారు. మగవాళ్లంతా మద్యానికీ జూదానికీ బానిసలై మూడు గొడవలూ, ఆరు కొట్లాటలూ అన్నట్టు ఉండేది ఊరి పరిస్థితి. కొన్నిసార్లు చంపుకునే వరకూ కూడా వచ్చేది. ఈ నేపథ్యంలో అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే చుట్టుపక్కల గ్రామస్థులెవరూ ముందుకొచ్చేవారు కాదు. అదంతా గమనించిన కొందరు యువకులు.. వ్యసనాల్ని అరికట్టాలని అర్థరాత్రి వేళ సారా కాసేవాళ్లను, జూదం ఆడేవారిని పట్టించాలని పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. పోలీసులేమో చెప్పిన సమయానికి వచ్చేవారు కాదు. ఫళితంగా వాళ్లొచ్చేవరకూ నిద్ర ఆపుకొని మెలకువగా ఉంటానికి చెస్‌ ఆడేవారు. ఆ సమయంలో మహిళలూ, పెద్దవాళ్లూ ఆసక్తిగా గమనించేవారు. అలా ఆ యువకులు గ్రామస్థుల దుర్వ్యసనాలకు ఆడ్డుకట్ట వేశారు.

చెస్‌ ఆడితే టీ, బిస్కెట్లు...

అదే సమయంలో ఆ గ్రామంలో పదో తరగతి చదువుతున్నాడు ఉన్నికృష్ణన్‌. అమెరికా చెస్‌ దిగ్గజం బాబీ ఫిషర్‌ పదహారేళ్లకే గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడన్న వార్త చదివిన ఉన్నికృష్ణన్‌ కూడా అతడిలా పేరు తెచ్చుకోవాలని పొరుగూరు వెళ్లి మరీ చెస్‌ నేర్చుకున్నాడు. తనలానే ఊళ్లో వాళ్లకీ చెస్‌ పట్ల ఆసక్తి ఉందని గమనించిన ఉన్నికృష్ణన్‌.. స్కూల్‌ నుంచి రాగానే తన ఇంటికొచ్చిన వాళ్లందరికీ చెస్‌ నేర్పించేవాడు. క్రమంగా తన వ్యక్తిగత లక్ష్యాన్ని పక్కన పెట్టి ఇంటి పక్కనే ఓ షెడ్డు వేసి చెస్‌ క్లాస్‌లు తీసుకోవడం మొదలుపెట్టాడు. అలానే ఆ ఊళ్లోనే ఓ చిన్న హోటల్‌ పెట్టుకున్నాడు. మరింత మందిని ప్రోత్సహించాలని తన హోటల్‌కి వచ్చి చెస్‌ ఆడిన వాళ్లకి టీ, బిస్కెట్ల్లూ ఉచితంగా ఇచ్చేవాడు. అలా ఉన్నికృష్ణన్‌ చలవతో ఊళ్లోని మహిళలూ, ముసలివాళ్లూ కూడా చెస్‌ నేర్చుకున్నారు.

ఆటగాళ్లకు చిరుతిండి అందిస్తున్న ఉన్నికృష్ణన్‌

సమయం దొరికితే చదరంగంతోనే కాలక్షేపం చేయడం మొదలుపెట్టారు. అలా వంద శాతం చెస్‌ ఆటగాళ్లున్న గ్రామంగా మరోట్టిచల్‌ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతోపాటు అది వారి జీవనశైలిలో భాగమైంది. జిల్లా స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా ఆ ఊరివాళ్లు పాల్గొని తీరాల్సిందే. అలానే ఏడేళ్ల క్రితం 'ఆగస్టు క్లబ్‌' పేరుతో తెరకెక్కిన చిత్రంలో చదరంగం గ్రామంగా మరోట్టిచల్‌ ఎదిగిన తీరును ఎంతో చక్కగా చూపించారు. ఇప్పటికీ ఆ గ్రామస్థుల చేతిలో సెల్‌ఫోన్లకు బదులు చదరంగం బోర్డులు కనిపిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ విప్లవాన్ని తిప్పికొట్టిన ఈ అలవాటును వ్యసనం అనకూడదేమో కదా!

స్కూళ్లో విద్యార్థులకు ప్రత్యేక చెస్ క్లాస్​లు
Last Updated : Feb 29, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details