కెన్యా అథ్లెట్ ఎల్యూడ్ కిప్‌చోగి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రియా రాజధాని వియాన్నలో జరిగిన ఓ మారథాన్‌ను రెండు గంటల్లోనే పూర్తి చేసి ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్నాడు.
ఓ మారథాన్‌ను రెండు గంటల వ్యవధిలో పూర్తి చేయవచ్చా లేదా అనే ప్రశ్నకు సమాధానం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వియన్నాలోని అతిపెద్ద పార్కు ఇందుకు వేదికైంది. దాదాపు 43 కిలోమీటర్లు సాగిన ఈ రేస్‌ను పూర్తి చేయడానికి కిప్‌చోగి తీసుకున్న సమయం 1 గంట 59 నిమిషాల 40.2 సెకన్లు. దీని ద్వారా... ఓ మారథాన్‌ను రెండు గంటల్లోపే పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు కిప్‌చోగి.
నిజానికి 2017లోనే ఈ తరహా పోటీలో పాల్గొన్నాడు కిప్‌చోగి. ఇటలీలో జరిగిన ఆ మారథాన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. కానీ పరుగును పూర్తి చేయడానికి 2 గంటల 9 సెకన్లు పట్టింది. అప్పటి నుంచి నిరంతరం శ్రమించి, కఠోర సాధన చేసి.. రెండు గంటల్లోపే మారథాన్‌ను పూర్తి చేయాలన్న తన గమ్యాన్ని చేరాడు కిప్‌చోగి.