శ్రీనివాస గౌడను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం అభినందించారు. అతడి కార్యాలయానికి పిలిపించి శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్‌లో ఇప్పుడే పాల్గొనని, దానికి కొంత సమయం కావాలని తెలిపాడు.
‘‘సాయ్ నిర్వహించే ట్రయల్స్‌లో నేను పాల్గొనలేను. కంబళలో మరిన్ని ఘనతలు సాధించాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం కంబళ టోర్నమెంట్ సాగుతోంది. అందుకే ఒక నెల గడువు కావాలని సాయ్‌ను కోరాలని భావిస్తున్నా. అయితే కంబళ, అథ్లెట్స్ పాల్గొనే ట్రాక్స్ రెండూ వేరుగా ఉంటాయి. ట్రాక్స్‌లో వేళ్ల మీద పరిగెత్తితే, కంబళలో మడమల మీద పరిగెత్తుతాం. ఒక దానిలో రాణించేవారు వారు మరో దానిలో అంతగా సత్తాచాటలేరు. ట్రాక్స్ ఈవెంట్స్‌లో రాణించిన ఎంతో మంది సంప్రదాయ క్రీడల్లో విజయవంతం కాలేకపోయారు. ఇంతలా ప్రఖ్యాతి చెందుతానని ఎప్పుడూ అనుకోలేదు. దీనిలో నా దున్నపోతులదే కీలకపాత్ర. అయితే అందరూ ఉసేన్ బోల్ట్‌తో నన్ను పోలుస్తున్నారు. ఆయన ప్రపంచ ఛాంపియన్. నేను కేవలం బురద వరి పొలాల్లో పరిగెత్తేవాడిని’’.