అది 2000 సిడ్నీ ఒలింపిక్స్.. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పోటీలు జరుగుతున్నాయి.. పతకమే లక్ష్యంగా బరిలో దిగిన తెలుగమ్మాయి మొత్తం 240 కిలోల బరువెత్తి (స్నాచ్‌లో 110, క్లీన్ అండ్ జర్క్‌లో 130 కేజీలు) కాంస్యం సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. పోడియంపై నిల్చుని త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన ఆ వీర వనిత పేరు.. కరణం మల్లీశ్వరి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి.. ఒలింపిక్స్‌లో పతకం వరకూ చేరిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆ అద్భుతం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెబినార్‌లో మాట్లాడుతూ ఆమె ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
ఒలింపిక్స్ పతకం సాధించి అప్పుడే రెండు దశాబ్దాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని మల్లీశ్వరి తెలిపింది. టీ స్పోర్ట్స్ హబ్, మల్లీశ్వరి ఫౌండేషన్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడుతూ.. "1994లో 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచా. ఆ తర్వాతి ఏడాది కూడా పసిడి సాధించా. దీంతో స్వర్ణమే లక్ష్యంగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టా. పోటీల రోజు పొద్దున లేచి దేవుడికి దండం పెట్టుకుని వేదికకు చేరుకున్నా. ఒక్కసారి పోటీపై దృష్టిపెడితే ఇక మిగతా ప్రపంచం మరిచిపోయేదాన్ని. నా మనసంతా పసిడిపైనే నిలిపా. కానీ కాంస్యం దక్కింది. అయినా ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత మహిళగా నిలిచినందుకు గర్వంగా ఉంది. భారత పతాకం రెపరెపలాడుతుంటే ఆనందంతో పొంగిపోయా" అని ఆ రోజును గుర్తుచేసుకున్నారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 54 కేజీల విభాగంలో పోటీపడ్డ ఆమె ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగానికి మారడం గురించి మాట్లాడుతూ.. "12 ఏళ్ల వయసులోనే వెయిట్‌లిఫ్టింగ్ మొదలెట్టా. వయసుతో పాటు బరువు కూడా పెరగడం వల్ల పోటీపడే విభాగం మారాల్సి వచ్చింది. పోటీల కోసం బరువు తగ్గడం శరీరానికి మంచిది కాదని అప్పటి కోచ్‌లు చెప్పడమే దానికి కారణం. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల ప్రత్యేక ఆహార నియమాలు అంటూ ఏమీ ఉండేవి కావు. జాతీయ శిబిరాల్లో అయితే ప్రత్యేక భోజనం ఉండేది. కానీ మళ్లీ ఇంటికి వచ్చాక మజ్జిగలో అంబలి కలిపి తాగేదాన్ని. రాగి సంగటి తినేదాన్ని. మా అమ్మ చాలా ప్రోత్సహించేది. ఆడపిల్లకు బరువులెత్తే ఆటలెందుకని బంధువులు చెప్పినా ఆమె వినలేదు" అని కరణం మల్లీశ్వరి చెప్పారు.
ఏమీ మారలేదు